సినిమా వ్యాపారమే. కానీ దాన్నో తపస్సులా భావించేవాళ్లు చాలామంది ఉంటారు. సరైన పాత్ర పడాలే గానీ, అందుకోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధ పడతారు. ఇప్పుడు ఆ అవకాశం కృతి సనన్‌కి వచ్చింది. ఈ పొడుగు కాళ్ల సుందరిని.. చాలామంది గ్లామర్ డాళ్‌గానే చూశారు. కానీ... ఓం ప్రకాశ్ రౌత్‌కి మాత్రం కృతిలో ఓ సీత కనిపించింది. తన `ఆదిపురుష్`తో సీతగా.. కృతిని ఫిక్స్ చేశాడు. రాకరాక అరుదైన అవకాశం వస్తే.. కృతి వదులుతుందా? అందుకోసం అహర్నిశలూ కష్టపడుతోందట.
సీత మహా సాద్వి. మాట, నడక, నడతో సౌమ్యం కనిపించాలి. అందుకోసం ఇంకాస్త నాజూగ్గా మారాలనుకుంటోంది కృతి. అందుకే.. ఆహార నియమాల్ని చాలా పాటిస్తోందట. నాన్ వెజ్ జోలికి అస్సలు వెళ్లడం లేదని, తనకిష్టమైన ఐస్ క్రీమ్ ని కూడా త్యాగం చేసిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు.. కృతి తెలుగు నేర్చుకునేందుకు ఓ ట్యూటర్ నికూడా నియమించుకుంది. ఈసారి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పబోతోందని సమాచారం.