ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్‌లో సీతగా కృతి సనన్ ఫిక్సయిపోయింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించేసింది కూడా. కృతి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. మహేష్‌బాబు `నేనొక్కడినే`లో తనే కథానాయిక. దోచేయ్‌లో నాగచైతన్య పక్కన చేసింది. రెండూ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఆ తరవాత.. తెలుగులో ఆమె పేరు వినిపించలేదు. అయితే సడన్ గా... `ఆదిపురుష్` కోసం కృతి పేరు బయటకు వచ్చింది.
సీతగా కృతి అన్నప్పుడు ఎవరూ పెద్దగా నమ్మలేదు. ఎందుకంటే.. స్టార్ హీరోల సరసన నటించే స్కోప్ కృతికి లేదన్నది అందరి నమ్మకం. అందుకే... కీర్తి సురేష్, కియారా అద్వాణీల వైపు దృష్టి మళ్లింది. వీరిద్దరిఇలో ఒకరు సీత పాత్ర లో ఖాయమన్న ప్రచారం మొదలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే అనుకున్నారు. కానీ ఇప్పుడు సడన్ గా కృతి పేరు ఖాయమైపోయింది. ప్రభాస్ ఇమేజ్ వేరు. తను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.
తనతో సినిమా అంటే.. కచ్చితంగా స్టార్ హీరోయిన్ ని దింపాల్సిందే. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా దానికే ఫిక్సయ్యారు. ఇప్పుడు వాళ్ల కంటికి కృతి అనుతుందా, లేదా? అనేది పెద్ద ప్రశ్న. పైగా సీత పాత్ర అనగానే.. క్లీన్ లుక్ కావాలి. గ్లామర్ పాత్రలు పోషించే కృతి.. సీతగా సరిపోతుందా, లేదా? అనేది మరో అనుమానం. మరి మేకర్స్ ఏం ఆలోచించి.. కృతిని ఎంపిక చేశారో..?