కృతి శెట్టి... ఈ అమ్మాయి నటించిన ఒక్క సినిమా కూడా బయటకు రాలేదు. ఇంతలోనే ఆఫర్లే ఆఫర్లు. అవును... కృతి శెట్టి ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ కథానాయిక. ప్రస్తుతం 'ఉప్పెన'లో నటిస్తోంది. వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. ఉప్పెన ప్రచార చిత్రార చిత్రాల్లో కృతి లుక్స్ చూసి టాలీవుడ్ దర్శక నిర్మాతలు తెగ ముచ్చట పడిపోతున్నారు. అందుకే ఉప్పెన విడుదల కాకముందే.. తమ సినిమాల్లో కథానాయికగా కృతిని ఫిక్స్ చేసేసుకుంటున్నారు.
నిఖిల్ కొత్త చిత్రం 18 పేజీల్లో కృతిని కథానాయికగా ఎంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు విశ్వక్‌సేన్ చిత్రంలోనూ తానే హీరోయిన్ అని టాక్. విశ్వక్ సేన్ కథానాయకుడిగా ఇటీవల 'పాగల్' అనే సినిమా క్లాప్ కొట్టుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలీదు. ఆ స్థానం కృతికి దక్కిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీస్ మరో రెండు సినిమాల కోసం కృతితో ఎగ్రిమెంట్ కుదుర్చుకుందట. అంటే.. కృతి చేతిలో నాలుగు సినిమాలున్నట్టు.