సినీ ఇండస్ట్రీని పైరసీ బూతం ఎలా పట్టి పీడిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా నాని నటించిన 'కృష్ణార్జున యుద్దం' సినిమా పైరసీ వీడియోని తెలంగాణా ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడంతో ఇష్యూ సీరియస్ అయ్యింది.
అయితే ఇలా గతంలో చాలా సినిమాల విషయంలో జరిగింది. కానీ ఈ విషయం ఈ సారి తెలంగాణా మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆర్టిసీ వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగుళూర్ నుండి హైద్రాబాద్ వస్తున్న తెలంగాణా ఆర్టీసీ బస్సులో ఈ సినిమా పైరసీ వీడియోని ప్రదర్శిచడంతో, బస్సులో ప్రయాణిస్తున్న సునీల్ అనే ఓ వ్యక్తి, రన్ అవుతున్న సినిమా క్లిప్పింగ్‌ని మంత్రి కేటీఆర్‌కి పంపించాడు.
ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఈ రకంగా పైరసీలు జరుగుతుంటే, సామాన్య వ్యక్తుల్ని ఈ విషయంలో ఎలా ప్రశ్నిస్తారని సదరు వ్యక్తి కేటీఆర్‌ని ప్రశిస్తూ, ట్వీట్ చేశారు. ఆ వ్యక్తి ట్వీట్‌కి వెంటనే స్పందించిన కేటీఆర్ ఇకపై ఆర్టీసీలో ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని ఆర్టీసీ ఎండీకి సూచించారు.
నాని ద్విపాత్రాభినయంలో వచ్చిన 'కృష్ణార్జున యుద్ధం' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అనుపమా పరమేశ్వరన్, రుక్సార్‌మీర్ ఈ సినిమాలో నానికి జంటగా నటించారు.