మెగా సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ అంటే... అభిమానుల కోలాహలం ఓ రేంజులోఉంటుంది. అక్కడ వేదిక ఎక్కేది ఎవరైనా సరే - పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురావాల్సిందే. లేదంటే.. 'పవర్ స్టార్.. పవర్ స్టార్' అంటూ పవన్ అభిమానులు అరుస్తూనే ఉంటారు. ఇలాంటి అనుభవం కేటీఆర్‌కీ ఎదురైంది. 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి అతిథిగా హాజరయ్యారు కేటీఆర్. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా పవన్ అభిమానులు అరుపులు, కేకలతో హోరెత్తించారు. దాంతో కేటీఆర్ కూడా పవన్ పేరు ప్రస్తావించకుండా ఉండలేకపోయారు.
''పవన్ కళ్యాణ్ ఇక్కడ లేరు. కానీ ఇటీవల రెండు మూడు సార్లు మేం మాట్లాడుకున్నాం. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ రెండు రంగాల్లోనూ ఆయన విజయం సాధించాలని నేను కోరుకుంటున్నా'' అన్నారు కేటీఆర్. ఆయన ప్రసంగంలో 'రంగస్థలం' సినిమానీ ప్రస్తావించారు.
''రంగస్థలం చిత్ర షూటింగ్ సమయంలో చరణ్‌ని కలిశాను. చరణ్ చేస్తున్నది పల్లెటూరి సినిమా అని తెలిసింది. నువ్వా పల్లెటూరి సినిమా అయితే నేను చూడను అని చెప్పాను. కానీ ఆ చిత్రం ఘన విజయం సాధించిందని మిత్రుల ద్వారా తెలిసింది. అప్పుడు చూశాను. చరణ్ చాలా చక్కగా నటించాడు. ఆ సినిమాలోని ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా పాటని ఎన్నికల్లో కూడా వాడుకొన్నాను. ఈ విషయం చరణ్‌కు, డీఎస్పీకు చెప్పలేదు. ‘అన్నా మా పాటను బాగా వాడుకొంటున్నారు’ అని డీఎస్పీ మాత్రం సెల్‌ఫోన్ లో సందేశం పంపాడు. 'వాడుకొంటాను కానీ డబ్బులైతే ఇవ్వనని' చెప్పాను'' అని చమత్కరించారు కేసీఆర్.