సినిమాలకు దూరమై ప్రజాసేవ నిమిత్తం జనసేన పార్టీని స్థాపించి, జనంతో మమేకమవుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్‌కి ఫ్యామిలీ నుండి ఫుల్ సపోర్ట్ అందుతోంది. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీకి 25 లక్షల విరాళం ప్రకటించగా, ఆయన తనయుడు వరుణ్‌తేజ్ కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శ్రీకాకుళం ప్రజలకు అండగా తనవంతుగా సాయం అందించాలనుకున్నాడు.
తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళంలోని మండస, వజ్రకొట్టూరు మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో మంచి నీరు కలుషితమై ప్రజలు ఇక్కట్ల పాలవుతున్న విషయాన్ని తెలుసుకున్న అల్లు అర్జున్ అక్కడ మూడు ఆర్వో (రివర్స్ ఆస్మాసిస్) వాటర్ ప్లాంట్స్, ఒక బోర్‌వెల్‌ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ వాటర్ ప్లాంట్స్ మరో 15 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ వాటర్ ప్లాంట్స్ కారణంగా దాదాపు ఆయా గ్రామాల్లో 3000 మందికి సురక్షిత మంచి నీరు అందుబాటులోకి రానుంది.
తమ కష్టాన్ని గుర్తించి, సురక్షిత మంచినీరు అందిస్తున్నందుకు అల్లు అర్జున్‌కి అక్కడి ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఏ కొత్త సినిమాలోనూ నటించడం లేదు. 'నా పేరు సూర్య' నిరాశపరచడంతో తన నుండి రాబోయే తదుపరి చిత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్‌ని మెప్పించే చిత్రం కావాలని లేట్ అయినా, లేటెస్టుగా రావాలని అనుకుంటున్నాడు. సో ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఆ క్రమంలో బన్నీ ఏ డైరెక్టర్‌కీ కమిట్ అవలేకపోతున్నాడు.