చిత్రం: కుంగ్ఫూ యోగా
నిర్మాణ సంస్థలు: తైహే ఎంటర్టైన్మెంట్స్, షైన్వర్క్ పిక్చర్స్
నిర్మాత: బారిబీ టాంగ్
సంగీతం: నాథన్ వాంగ్, కోమలి-శివాన్
ప్రధాన తారాగణం: జాకీ చాన్, ఆరిఫ్ రెహమాన్, జ్హంగ్ ఇక్సింగ్, సోను సూద్, మియా ముకి, దిశా పతాని, అమైరా దస్తూర్
కథ, కథనం, దర్సకత్వం: స్టాన్లీ టాంగ్
కుంగ్ఫూ యోగా కథ:
చైనా దేశానికి సంబంధించిన సుప్రసిద్ధ పురాతత్వ శాస్త్రజ్ఞుడు జాక్ (జాకీ చాన్). మరో పక్క భారత దేశానికి సంబంధించిన పురావస్తు శాస్త్రవేత్త అష్మిత (దిశా పతాని). రాజస్తాన్ లోని తన పూర్వీకులకు సంబంధించిన నిధి-నిక్షేపాల ను చేధించడానికి జాక్ సహాయం కోరుతుంది అష్మిత. అష్మిత కు సహాయపడేందుకు, తన సహాయకులు జ్హు (జ్హంగ్ ఇక్సింగ్) మరియు నుఒమిన్ (మియా ముకి) తో భారత దేశానికి బయల్దేరతాడు జాక్. అలా జాక్, అష్మిత తో కలిసి నిధిని చేధించే క్రమంలో రండాల్ (సోను సూద్) వారికి అడ్డుపడతాడు. రండాల్ చాలా శక్తివంతమైన బలగం తో జాక్ ప్రతి అడుగును తిప్పి కొడతాడు. ఒకానొక దశ లో జాక్, రండాల్ తో కలిసి పని చేయవలసి వస్తుంది. ఈ క్రమంలో చివరికి ఎవరు గెలిచారు? చివరికి నిధి ఏం అయింది? అన్న అంశాల చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది.
నటీనటుల పనితనం:
చిత్ర కథానాయకుడు జాకీ చాన్ ఎప్పటిలా తనదైన శైలిలో అలరించాడు. తనదైన మార్క్ పోరాట సన్నివేశాలతో స్క్రీన్ మీద ఎనర్జీ ని ప్రదర్శించాడు. చిత్రం అక్కడక్కడ బోర్ కొట్టినప్పటికీ జాకి చాన్ మాత్రం నచ్చేస్తాడు. చిత్ర ద్వితీయార్ధం లోని పోరాట సన్నివేశాలలో జాకీ ప్రదర్సన అద్బుతం.
సోను సూద్ ఈ చిత్ర ప్రతినాయకుడు. మన ప్రాంతీయ భాషా చిత్రాల తో పోలిస్తే తన పాత్ర కొంచెం వైవిధ్యంగా ఉంటుందేమో అని మనం ఆశిస్తే, అది నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఒక ప్రతినాయకుడిగా ఇంతకు ముందు తను ఏం చేసాడో ఈ చిత్రంలో కూడా అదే కొనసాగించాడు సోను. చిత్రంలో జాకీ కి ధీటైన ప్రతినాయకుడు అనిపించుకొనే అంశంలో మాత్రం సోను విజయం సాధించినట్టే.
చిత్రానికి మరో ఆకర్షణ ఆరిఫ్ రెహమాన్. ఆరిఫ్ కూడా తన నటన తో, హాస్యం తో ఆకట్టుకున్నాడు. జాకీతో, దిశా తో సన్నివేశాలలో ఆరిఫ్ నటన బాగుంది.
చిత్రంలో కథానాయిక దిశా పతాని. కేవలం అందచందాలకు మాత్రమే పరిమితం కాకుండా పోరాటాలను సైతం చక్కగా ప్రదర్శించి ప్రేక్షకులను కట్టిపడేసింది దిశా. చిత్రం ఆద్యంతం తన స్క్రీన్ ప్రెసెన్స్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది దిశా. ఈ చిత్రం లో మరో ముఖ్య పాత్ర పోషించిన అమైరా దస్తూర్ కూడా అందం మరియు నటన తో మంచి మార్కులను కొట్టేసింది.
జాకీ చాన్ కి సహాయకులు గా నటించిన జ్హంగ్ ఇక్సింగ్, మియా ముకి తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు.
మిగిలిన నటీనటులు తమ పాత్రలలో ఫర్వాలేదనిపించారు.
విశ్లేషణ:
జాకీ చాన్ యాక్షన్ మూవీస్ అంటే ప్రేక్షకులకు ఎప్పుడూ ఆసక్తే, అంతే కాకుండా విపరీతమైన పిచ్చి. ఇంతకు ముందు జాకీ చాన్, దర్శకుడు స్టాన్‌లీ టాంగ్ కాంబినేషన్‌లో రూపొందిన "రంబుల్ ఇన్ ది బ్రాంక్స్", "ది మిత్", "చైనీస్ జోడియాక్" వంటి చిత్రాలు రూపొందాయి. ఈ చిత్రాలు అన్నిటికీ ఏ మాత్రం తీసిపోకుండా ఉండేలా "కుంగ్ ఫు యోగా" ని నిర్మించారు చిత్ర నిర్మాతలు. ముఖ్యంగా జాకీ చాన్ పాత్ర ను చాలా బాగా తీర్చిదిద్దారు. పోరాట సన్నివేశాలు మరియు నిధి ని చేదించే క్రమంలో ప్రధాన పాత్రధారులు చూపిన నైపుణ్యం అబ్బురపరుస్తుంది. జాకి చాన్ చేసే విన్యాసాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. నిధి ని వెతుక్కుంటూ వెళ్ళే జాకి చాన్, దిశా లు చేసే నూతన విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కుంగ్ఫూ ను ప్రదర్శించి చేసే పోరాటాలు, నీటిలో వాయుదిగ్బంధన యోగా ప్రక్రియ వంటి అంశాలను బాగా తెరకెక్కించారు దర్శకులు. సినిమా లో ని ప్రధమార్థం చాలా వరకు చైనా దేశం లోనే జరుగుతుంది కనుక ఆ దేశం లోని లొకేషన్లను తెరపై బాగా చూపించే ప్రయత్నం చేసారు దర్శక నిర్మాతలు. ఆ తర్వాత దుబాయ్ లో తీసిన చేజింగ్ దృశ్యాలు కూడా అలరిస్తాయి.
సోను సూద్ చిత్రం లో పరిచయం అయ్యేంత వరకు కథ ముందుకు సాగుతుంది అన్నట్లు అనిపించదు. కొంత సాగతీత ధోరణిలోనే దర్శకుడు చిత్రాన్ని ముందకు సాగించాడు. పోరాటాలను అద్భుతంగా తీర్చిదిద్ధినప్పటికీ కొంత లైన్ క్రాస్ అయి లాజిక్ లను పూర్తిగా మర్చిపోయి ప్రేక్షకులు "వావ్" కాకుండా నవ్వుకొనే స్థితిలో తెరకెక్కించారు దర్శకుడు. జాకీ చాన్ చిత్రంలో పోరాటాలతో మంచి కథ ఉండడం అనివార్యం కాని ఈ చిత్రంలో కథకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చినట్లు ఎక్కడా అనిపించదు. కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేసిన కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. చిత్ర ద్వితీయార్ధం తో పోల్చుకుంటే మొదటి భాగమే కాస్త జనరంజకంగా సాగుతుంది. మొదటి భాగం లో దుబాయ్ లో జరిగిన సన్నివేశాలు, రెండో భాగం లో ఇండియా లో నిధిని వెతికే పతాక సన్నివేశాలు బాగుండడం కలిసొచ్చే అంశం. చిత్ర కథనం లో అనేక లోటుపాట్లు ఉన్నాయి. ఆసక్తికరమైన కథనాన్ని అందించడం లో దర్శకుడు విఫలమయ్యాడు అని చెప్పొచ్చు. చిత్రం మొదలయిన కొద్ది నిమిషాల్లోనే మనకి అనేక అంశాల గురించి చెప్తూ అర్ధం చేసుకొనే సమయం కూడా లేకుండా చేస్తారు దర్శకుడు.
కుంగ్ఫు యోగా చిత్రం ఆశించిన స్థాయిలో ఉండనప్పటికీ కొంత లో కొంత మెరుగైన అంశాలు జోడవడం వలన పెద్దగా బోర్ కొట్టదు. తక్కువ నిడివి ఉండడం కూడా సినిమా కి ప్లస్ పాయింట్. చివరగా కథ, కథనం పెద్దగా లేనప్పటికీ ఈ చిత్రంలో ని పోరాటాల కోసం అయినా చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు.
నచ్చచ్చు:
- జాకీ చాన్
- ప్రధాన పాత్రధారుల నటన
- పోరాటాలు
- చాయాగ్రహణం
నచ్చకపోవచ్చు:
- కథ లో కొత్తదనం లేకపోవడం
- నిరాసక్తి కలిగించే కథనం
- లాజిక్ లేని సన్నివేశాలు
సంగీతం:
ఈ చిత్రానికి నాథన్ వాంగ్, కోమలి-శివాన్ లు అందించిన సంగీతం వినసొంపుగా ఉండడం సానుకూలాంశం. అలాగే వారందించిన నేపథ్య సంగీతం కొంత వరకు చిత్రానికి సహకరించింది అని చెప్పుకోవచ్చు.
ఇతరులు:
చాయాగ్రహణం చాలా బాగుంది. చిత్రం లోని అన్ని లొకేషన్లను చాలా చక్కగా చూపించారు. ప్రతి ఫ్రేమ్ చాలా బాగా వచ్చింది. చిత్రం లో కథ పెద్దగా లేకపోవడం మైనస్. దర్శకుడు తన పాత చిత్రాల తాలుకు రిఫరెన్స్ లు చాలా నే వాడాడు. పోరాటాలను అద్భుతంగా డిజైన్ చేసారు. కూర్పు ఫరవాలేదు అనిపించింది. నిర్మాణ విలువలు బాగా నే పాటించారు.
ఐక్లిక్ తీర్పు- కుంగ్ఫూ యోగా:
ఆశించిన స్థాయి లో చిత్రాన్ని తెరకెక్కించడం లో విఫలమయ్యారు దర్శక నిర్మాతలు. మీరు జాకీ చాన్ మరియు యాక్షన్ చిత్ర ప్రియులు అయితే ఒక్కసారి చూడొచ్చు. "సాహసం" వంటి సినిమా ను జాకి చాన్ చేస్తే ఎలా ఉంటుందో, అదే "కుంగ్ఫూ యోగా".
ఆఖరి మాట: ఓన్లీ కుంగ్ఫూ నో యోగా