కళాతపస్వి కె.విశ్వనాథ్‌కి ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. రేపు (బుధవారం) దిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో కళాతపస్వి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోనున్నారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా ఈ పురస్కారం అందిస్తున్నారు. సినీ రంగంలో దిగ్గజాలు ఈ పురస్కారాన్ని అందుకొన్నారు. అయితే ఇప్పటి వరకూ అవార్డు గ్రహీతకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కానీ తొలిసారి.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పుచ్చుకొన్న తరవాత.. విశ్వనాథ్‌కి మాట్లాడే ఛాన్స్ ఇచ్చింది రాష్ట్రపతి భవన్. ఇప్పటి వరకూ ఏ అవార్డీకీ ఈ అవకాశం దక్కలేదు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. అవార్డు అందుకోవడం కోసం ఈ రోజు సాయింత్రమే విశ్వనాథ్ తన కుటుంబ సభ్యులతో కలసి దిల్లీ బయల్దేరబోతున్నారు. విశ్వనాథ్ తిరిగి వచ్చాక ఆయన్ని ఘనంగా సన్మానించాలని తెలుగు చిత్రసీమ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది.