వర్మ గారూ.. 'లక్ష్మి' పాత్రలో ఎవరు.?

By iQlikMovies - October 15, 2018 - 17:36 PM IST

మరిన్ని వార్తలు

రామ్‌గోపాల్‌ వర్మ అంటేనే ఓ సంచలనం కదా.! 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాకి సంబంధించి కీలకమైన ప్రకటన అక్టోబర్‌ 18న రానుండగా, అదే రోజు సినిమాలో నటించబోయే నటీనటుల వివరాల్ని రామ్‌గోపాల్‌ వర్మ వెల్లడిస్తాడనే ప్రచారం జరుగుతోంది. 

ఇప్పటికే నటీనటుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చిందని ప్రచారమైతే జరుగుతోంది. అదెంత నిజమో తేలాల్సి ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్‌ పాత్రలో ఎవరు నటిస్తారు.? ఆయన సతీమణి లక్ష్మీ పార్వతిగా ఎవరు కన్పించనున్నారు.? ఈ కథకి అత్యంత కీలకమైన చంద్రబాబు పాత్రలో ఎవర్ని వర్మ ఎంపిక చేశారు.? వంటి ప్రశ్నలు సినీ అభిమానుల్లో రేకెత్తడం సహజమే. రామ్‌గోపాల్‌ వర్మ గతంలో రూపొందించిన 'రక్తచరిత్ర' సినిమా కోసం శతృఘన్‌ సిన్హాని ఎంపిక చేసిన సంగతి తెల్సిందే. ఆ 'షాట్‌ గన్‌' మళ్ళీ తెలుగు తెరపై కన్పించబోతున్నారనీ, 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'లో ఎన్టీఆర్‌ ఆయనేనని గాసిప్స్‌ గట్టిగా వినవస్తున్నాయి. 

ఇంకోపక్క లక్ష్మీ పార్వతి పాత్ర కోసం ఓ తమిళ నటితో సంప్రదింపులు జరుగుతున్నాయట. ఓ ప్రముఖ నటుడి కుమార్తె ఆమె. ఆమె నటించిన ఓ సినిమా తమిళంతోపాటు, తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఇటీవలే రామ్‌గోపాల్‌ వర్మ, ఆమెతో లక్ష్మీ పార్వతి పాత్ర కోసం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఆ పాత్రకి ఒప్పుకుందా.? లేదా.? అనేది మాత్రం తెలియరాలేదు. ఆమె నటిస్తే మాత్రం సినిమాకి మరింత హైప్‌ వస్తుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. 

చంద్రబాబు పాత్ర కోసం సోషల్‌ మీడియా నుంచి ఓ వ్యక్తిని వర్మ ఎంపిక చేసినట్లు ఇప్పటికే వార్తలొస్తున్నాయి. ఓ హోటల్‌ సర్వర్‌, అచ్చం చంద్రబాబులా వున్న వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండగా, అతనితోనే వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'లో చంద్రబాబు పాత్ర చేయించబోతున్నారట. అయితే ఈ వివరాల్ని వర్మ అధికారికంగా ప్రకటించాల్సి వుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS