తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి గట్టిగా మాట్లాడి, ఆ అంశాన్ని ఎంతలా హైలైట్ చేసిందో, తన అసభ్యకర ప్రవర్తనతో అంతే వేగంగా ఆ ఉద్యమాన్ని నీరుగార్చేసిందనే విమర్శలు శ్రీరెడ్డిపై చాలానే ఉన్నాయి. ఆ దెబ్బతో చెన్నయ్‌కి చెక్కేసిన శ్రీరెడ్డి, అక్కడినుంచే ఇప్పుడు 'మీ..టూ..' ఉద్యమంపై 'ఆపరేషన్' చేపట్టిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఓ రాజకీయ నాయకుడిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. అయితే, శ్రీరెడ్డి చేసిన ఆరోపణల కారణంగా ఇప్పుడు 'మీ..టూ..' ఉద్యమమే పక్కదారి పట్టేస్తోందని కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తనూశ్రీదత్తా 'మీ..టూ..' ఉద్యమానికి శ్రీకారం చుట్టాక, ఆ ఎఫెక్ట్ కేంద్ర మంత్రి వరకూ పాకింది. కొన్ని మీడియా సంస్థలకు చెందిన ముఖ్యమైన వ్యక్తులు తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది.
అయితే ఆరోపణలు చేస్తే సరిపోదనీ, వాటిని నిరూపించాలనీ ఇప్పుడిప్పుడే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి నుంచి డిమాండ్లు, ఆరోపణలు చేసినవారిపై లీగల్ నోటీసులూ పుట్టుకొస్తున్నాయి. సినీ పరిశ్రమలోనూ, ఇతర అనేక రంగాల్లోనూ మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయనేది కఠోర వాస్తవం. ఫలానా రంగంలో లైంగిక వేధింపులు లేవని చెప్పడానికి వీల్లేదు. అయితే మహిళా లోకం గట్టిగా గళం విప్పడంతోపాటుగా, పోలీసులకు ఫిర్యాదు కూడా చేయాల్సి వుంటుంది. అలా ఫిర్యాదు చేస్తే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై విచారణ ప్రారంభమవడానికి ఆస్కారమేర్పడుతుంది.
ప్రముఖ నటుడు సురేష్‌బాబు తనయుడిపైనా, మరికొందరు సినీ ప్రముఖులపైనా ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి, తాజాగా ఓ రాజకీయ నాయకుడిపైనా ఆరోపణలు చేయడమే తప్ప, ఆయా వ్యక్తులపై పోలీసులకు ఆధారాలతో పాటు ఫిర్యాదు చేయలేదు. దాంతో, ఆమె చెప్పే మాటలకు విలువ లేకుండా పోతోంది.