రైతు సమస్యలపై వచ్చిన 'మహర్షి' సినిమా మహేష్‌బాబుతో తెరకెక్కించడం వల్ల అంత పెద్ద హిట్ అయ్యింది కానీ, మరొకరితో తెరకెక్కిస్తే, ఆ సినిమాని ఎవరు చూస్తారని అంటున్నారు వర్మ. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు వర్మ ప్రెస్‌మీట్‌ని ఆంధ్రాలో అడ్డుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది. సైకిల్ టైర్ పంక్చర్ అయిపోయింది. దాంతో వర్మ సినిమాకి లైన్ క్లియర్ అయ్యింది.
'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని ఆంధ్రాలో ఈ నెల 31న విడుదల చేయనున్నామని వర్మ ప్రకటించారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు చేసిన కుట్రలను బయట పెట్టడమే ఈ సినిమా ఉద్దేశ్యమని వర్మ మరోసారి తెలిపారు. ఈ సందర్భంగా వర్మ మరో సంచలన ప్రకటన చేశారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తర్వాత వర్మ నుండి రాబోతున్న సినిమా టైటిల్‌ని అనౌన్స్ చేశారు. సినిమా పేరు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. టైటిల్ చూస్తేనే ఈ సినిమా స్వరూపం ఏంటో, ఎవరిని వర్మ టార్గెట్ చేశారో తెలిసిపోతోంది. అయినా ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో నిలవడం వర్మగారికి అలవాటే.
అయితే, తనకు వ్యవసాయం తెలియదనీ, రైతుల సమస్యలు అస్సలు తెలియవనీ అందుకే ఏ కాన్సెప్ట్ ఫ్రెష్‌గా ట్రెండ్స్‌లో ఉంటుందో ఆ కాన్సెప్ట్‌ని పట్టుకుని సినిమాలు తెరకెక్కిస్తుంటాననీ వర్మ తెలిపారు. ఉత్కంఠభరితంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజెంట్ హాట్ కాన్సెప్ట్ ఇదే మరి. అందుకే మన వర్మగారు ఈ కాన్సెప్ట్‌ని పట్టుకున్నారు. చూడాలి మరి 'కమ్మ', 'రెడ్డి' అంటూ వర్మ తీసుకున్న ఈ కాన్సెప్ట్‌తో ముందు ముందు ఎలాంటి సంచలనాలు నెలకొంటాయో.