'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఇది స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రలో అత్యంత కీలకమైన ఓ భాగాన్ని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎంచుకున్న నేపథ్యం. స్వర్గీయ ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాల్లో సాధించిన, సంపాదించిన పేరు ప్రఖ్యాతలు అందరికీ తెలుసు. ఆయన గొప్పతనం గురించి, ఆయన ఘనతల గురించి తెలుగు వారెవ్వరికీ కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు.
కానీ అంతటి మహానుభావుడు చివరి రోజుల్లో నిరాదరణకు గురయ్యాడు. అయినవారే వెన్నుపోటు పొడిచారు. ఆ వెన్నుపోటు ఇతివృత్తంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నుండి ఓ అద్భుతమైన పాట ఈ నెల 21న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వర్మ వెల్లడించాడు. వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ అంతరంగం ఈ పాటలోని ప్రతీ అక్షరం మనకు తెలియజేస్తుందట.
ఆ సమయంలో ఎన్టీఆర్ ఆవేదన ఏ స్థాయిలో ఉందో తెలియజేసేలా భావోద్వేగభరితమైన పదజాలం, దానికి తగ్గ సంగీతం ఈ పాటకు కుదిరాయట. వెన్నుపోటు అనగానే రాజకీయాల్లో చంద్రబాబు పేరు గుర్తు రావడం సహజమే. మరి ఆ చంద్రబాబు నాయకత్వంలోనే తెలుగుదేశం పార్టీ ఈ వెన్నుపోటు పాటపై ఎలా స్పందిస్తుందో తెలియాలంటే కూసింత వేచి చూడాల్సిందే. ఈ సినిమాకి కళ్యాణీ మాలిక్ సంగీతం అందిస్తున్నారు.