'ఆమె చూపుల్లోని కసి, చివరిసారిగా 'ఎంటర్ ది డ్రాగన్' సినిమాలోని బ్రూస్‌లీ కళ్లలో చూశాను. ఇంతవరకూ నేను చూసిన హీరోలందరినీ మించిన హీరోయిజం కంగనాలో కనిపించింది. ఆమె కళ్లల్లోని ధైర్యానికి చూపు తిప్పుకోలేకపోయా..' అంటున్నారు రామ్‌గోపాల్ వర్మ. ఇదంతా లేటెస్టుగా విడుదలైన 'మణికర్ణిక' సినిమా ట్రైలర్ కోసం. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే అందరికీ నచ్చేసింది. కంగనాపై ప్రశంసల జల్లు కురిపించేస్తున్నారు ట్రైలర్ చూసినవాళ్లంతా.
ఇక సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పొగిడినా సమ్‌థింగ్ స్పెషలే, తిట్టినా సమ్‌థింగ్ స్పెషలే.. కదా. అందుకే కంగానాని ఇదిగో పై విధంగా పొగడేసి, తన స్పెషాలిటీని చాటుకున్నారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి, ట్రైలర్‌లో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో కంగనాని చూసి చూపు తిప్పుకోలేకపోతున్నాం. ఆమె నట విశ్వరూపం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందనిపిస్తోంది. మేకింగ్ వేల్యూస్ పరంగా, కంగనా అప్పియరెన్స్ పరంగా సినిమాని చాలా ఉన్నతంగా తీర్చి దిద్దారనిపిస్తోంది.
ఈ సినిమా స్టార్టింగ్ నుండీ వివాదాలతోనే సావాసం చేస్తోంది. అయితే ఆ వివాదాలన్నింటినీ తట్టుకుని 'మణికర్ణిక' ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే అప్పుడే ఈ సినిమాకి లైన్ క్లియర్ అయినట్లేం కాదు, ఏదో మూల నుండి వివాదాలు పొంచి చూస్తూనే ఉన్నాయి. డైరెక్టర్‌గా క్రిష్ జాగర్లమూడి పేరు మాత్రమే టైటిల్స్‌లో వేయాల్సి ఉంది. కానీ క్రిష్‌తో పాటు కంగనా పేరు కూడా ఉండడం తాజాగా వివాదానికి కారణమైంది. చూడాలి మరి ఈ వివాదంపై 'మణికర్ణిక' ఎలాంటి వివరణ ఇస్తుందో...