వర్మ దర్శకత్వంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తెరక్కెనుంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ జరిగినప్పటి నుండీ వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ సినిమాపై స్పందించారు. 'ఎన్టీఆర్ చరిత్ర తెరిచిన పుస్తకం. వాస్తవాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు. వర్మ సినిమాపై అతిగా స్పందించొద్దు అని టీడీపీ పార్టీ నాయకులకు చంద్రబాబు తెలిపారు..' దాంతో చంద్రబాబు వ్యాఖ్యలపై వర్మ సోషల్ మీడియాలో స్పందించాడు. ఆయన చెప్పింది నిజం. వక్రీకరిస్తే జనం చూడరు. వక్రీకరించకుండా, వాస్తవాలను మాత్రమే 'లక్ష్మీస్ ఎన్టీఆర్'గా తెరకెక్కిస్తున్నాను. చిరిగిపోయిన, లేదా చించివేయబడ్డ పేజీలను మాత్రమే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ద్వారా అతికించబోతున్నాను.. అని వర్మ చెప్పారు. ఇంతకుముందెన్నడూ వర్మ తన సినిమాల విషయంలో ఇంతగా స్పందించలేదు. విమర్శలు వర్మకు కొత్తేమీ కాదు. కానీ ఈ సినిమా విషయంలో ప్రతీ విమర్శనీ ఎదుర్కొంటున్నాడు వర్మ. ప్రతీ విమర్శకీ సమాధానం చెబుతున్నాడు. తద్వారా సినిమాకి బోలెడంత హైప్ క్రియేట్ అవుతోంది. సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. నటీనటుల వివరాలు కూడా ఇంకా తేలలేదు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సి. రాకేష్ రెడ్డి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని నిర్మించబోతున్నారు.