సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తాను నమ్మింది తెరపై చూపించగలడు. కాబట్టి, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని ఎలాగైనా తెరకెక్కించే ధైర్యం ఆయన చేయగలడన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.
స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించడం, ఆ తర్వాత నందమూరి కుటుంబంలో వచ్చిన మార్పులు, తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ ఆ పార్టీకి దూరమవడం, చివరికి ఆయన మరణం.. ఇవన్నీ 'కల్ట్'గా చూపించే ధైర్యం రామ్‌గోపాల్ వర్మకి తప్ప ఇంకెవరికీ లేవు. ఆనాటి ఆ ఘటనల్ని ఇప్పుడు తెరపై చూపించడం ద్వారా, ఆ మహా మనీషిని అవమానించడమేనని ఒకరిద్దరు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
కానీ, స్వర్గీయ ఎన్టీఆర్‌కి చివరి రోజుల్లో తీరని అన్యాయం జరిగిందనే భావన కొందరు నందమూరి అభిమానుల్లో వుంది. అదే, విషయాన్ని కేంద్రంగా చేసుకుని రామ్‌గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తీస్తే, ఖచ్చితంగా సినిమా పెద్ద విజయాన్ని అందుకుంటుంది. 'ఎన్‌టిఆర్ కథానాయకుడు', 'ఎన్‌టిఆర్ మహానాయుకుడు' సినిమాల్ని ఎన్‌టిఆర్ బయోపిక్‌కి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 అనుకుంటే, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనేది పార్ట్ 3 అని భావించాల్సి ఉంటుంది.
అయితే 'ఎన్‌టిఆర్ మహానాయకుడు'లోనే, లక్ష్మీ పార్వతి ప్రస్తావన లేకుండా అత్యంత పకడ్బందీగా, మహానటుడి ముగింపుని చూపించే ప్రయత్నం చేస్తుండడంతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై ఉత్కంఠ మరింత పెరుగుతుందనీ, తెలుగు సినిమా పరిశ్రమలోనే అదో ప్రత్యేకమైన సినిమా అవుతుందనీ చాలామంది అభిప్రాయపడుతున్నారు.