'సంచలనం' వర్మ ఇంటి పేరుగా చెప్పుకోవాలి. రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. తాజాగా వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' వైపు అందరి దృష్టిని తిప్పుకునేలా వర్మ సంచలనాల ప్రయోగం మొదలైంది. హేతువాదిలా కనిపించే వర్మ ఇప్పుడు దైవ భక్తుడిగా మారిపోయాడు. ఆయన తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని శ్రీవారి సన్నిధిలో ప్రారంభించడం ఓ సెన్సేషన్ అయ్యింది.
'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో ఎవ్వరికీ తెలియని నిజాలను చూపించబోతున్నాడట. ఆ నిజాల్ని చాలా మంది ఒప్పుకోలేరేమో బహుశా అంటున్నాడు వర్మ. ఎన్టీఆర్ జీవితంలో ఎవ్వరికీ తెలియని ఆ నిజాలేంటీ.? అనే ఉత్కంఠతో ఈ సినిమాకి అప్పుడే ప్రమోషన్స్ మొదలెట్టేశాడు వర్మ. ఆ నిజాల్ని నిజాలుగా నిర్భయంగా చూపించగలిగే ధైర్యాన్ని, సాహసాన్ని తనకివ్వమనే దేవున్ని ప్రార్ధిస్తున్నాననీ, దైవ దర్శనాలు చేస్తున్నాననీ వర్మ చెబుతుండడం ఆయన అభిమానుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఏది ఏమైనా వర్మ తెరకెక్కించబోయే 'లక్ష్మీస్ ఎన్టీర్'పై ఆశక్తి బాగా పెరిగింది. మొన్న 'జీఎస్టీ'తో ప్రకంపనలు సృష్టించిన రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్'తో సృష్టించబోయే ప్రకంపనలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి. మరోవైపు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న 'ఎన్టీఆర్' చిత్రం భారీ అంచనాలతో, భారీ కాస్టింగ్‌తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలోని ఇంపార్టెంట్ రోల్స్‌ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్న క్రిష్ లక్ష్మీ పార్వతి పాత్ర కోసం ఎవరిని ఎంచుకున్నాడో ఇంకా తెలియరాలేదు. అలాగే వర్మ రూపొందిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో టైటిల్ పాత్ర పోషించేదెవరో కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.