ఒక సినిమా నాలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతుండడం అనేది నిజంగా గొప్ప విషయమే. అందులోనూ వేర్వేరు దర్శకకులు, వేర్వేరు నటీ నటులతో ఒకే సినిమాని రీమేక్ చేస్తుండడం ఆశ్చర్యకరమైన అంశమే. అలా జరగడం ఇదే తొలిసారేమో కూడా. బాలీవుడ్‌లో కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషించిన 'క్వీన్' చిత్రం దక్షిణాదిలోని నాలుగు భాషల్లో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే.
తెలుగులో తమన్నా హీరోయిన్‌గా 'దటీజ్ మహాలక్ష్మి' టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. 'అ' చిత్రంతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తమిళంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా 'ప్యారిస్ ప్యారిస్' టైటిల్‌తో తెరకెక్కుతోంది. రమేష్ అరవింద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడలో పారుల్ యాదవ్ టైటిల్ రోల్ పోషిస్తోంది. 'బటర్ ఫ్లై' టైటిల్‌తో రూపొందుతోంది.
ఈ చిత్రానికి కూడా రమేష్ అరవింద్ దర్శకుడు. మలయాళంలో మంజిమా మోహన్ హీరోయిన్‌గా 'జామ్ జామ్' టైటిల్‌తో రూపొందుతోంది. నీలకంఠ దర్శకత్వంలో రూపొందుతోందీ సినిమా. కాగా ఒకేసారి ఈ నాలుగు సినిమాల ఫస్ట్‌లుక్స్ విడుదల చేశారు. ఒకదానికొకటి భిన్నంగా ఆకర్షణీయంగా ఉన్నాయి ఈ లుక్స్. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే నలుగురు హీరోయిన్స్, నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్న ఈ నాలుగు పోస్టర్స్‌లోనూ బ్యాక్ గ్రౌండ్‌లో ఈఫిల్ టవర్ కామన్ ప్రోపర్టీగా కనిపిస్తోంది.
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ఈ నాలుగు చిత్రాలు.