అల్లు అరవింద్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న తొట్ట తొలి ఓటీటీ ఫ్లాట్ ఫామ్... ఆహా. దీని వెనుక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బిగ్ షాట్స్ ఉన్నారు. భారీగా పెట్టుబడి పెట్టారు. అయితే.. అనుకున్న సంఖ్యలో సినిమాలు ఆహాలో కనిపించడం లేదు. ఆ లోటు తీర్చడానికి ఇప్పుడు ఆహా నడుం కట్టింది. ఈ రోజు ఆహాలో.. `భానుమతి రామకృష్ణ` స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే `కృష్ణ అండ్ హిజ్ లీల` కూడా ఆహాకి రానుంది. ఇవి కాకుండా మరో 20 చిన్న సినిమాల్ని ఆహా కొనుగోలు చేసిందని టాక్. చిత్రీకరణ పూర్తయి, విడుదల కాకుండా నిలిచిపోయిన 20 చిన్న సినిమాల్ని ఆహా వెదికి పట్టుకుందని, వాటికి మంచి రేటు ఇచ్చి కొనుగోలు చేసిందని తెలుస్తోంది.
ఇక నుంచి.. ప్రతీ వారం ఆహా నుంచి ఓ కొత్త తెలుగు సినిమాని స్ట్రీమింగ్‌కి ఉంచబోతున్నట్టు సమాచారం. పెద్ద సినిమాలు ఎలాగూ ఓటీటీలోకి రావడానికి ఇష్టపడడం లేదు. అందుకే, చిన్న, మధ్య స్థాయి చిత్రాలపై దృష్టి పెడుతున్నాయి ఓటీటీ సంస్థలు. థియేటర్లు లేక విడుదలకు నోచుకోని 20 సినిమాలు ఇప్పుడు ఆహా చెంతకు చేరాయి. మొత్తానికి ఆహా కొత్త సినిమాలతో కళకళలాడబోతోంది. మరి ఈ ఓటీటీ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాలి.