'బాహుబలి' తర్వాత దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు ఆదరణ పెరిగింది. మన డబ్బింగ్ సినిమాలను విపరీతంగా చూస్తుండడంతో యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ నమోదవుతున్నాయి. ఒక్కో సారి ఆ వ్యూస్ సంఖ్య బిలియన్ల మార్క్ దాటుతోంది. ఈమధ్య రామ్, నితిన్ నటించిన సినిమాలు హిందీలో 200 మిలియన్ల వ్యూస్ దాటి సంచలనం సృష్టించాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ -సమంతాలు నటించిన 'అ ఆ' ను హిందీలో అదే టైటిల్ తో రిలీజ్ చేస్తే ఇప్పటికే 200 మిలియన్ల వ్యూస్ దాటి ఇంకా దూసుకుపోతోంది. మరోవైపు త్రినాధ్ రావు దర్శకత్వంలో రామ్ - అనుపమ పరమేశ్వరన్ నటించిన 'హలో గురు ప్రేమ కోసమే' సినిమాను 'దమ్ దార్ ఖిలాడి' పేరుతో విడుదల చేస్తే అది కూడా 200 మిలియన్ల వ్యూస్ దాటేసింది.
ఈ రెండు సినిమాలను ఆదిత్య మ్యూజిక్ వారి అఫీషియల్ ఛానెల్ లో విడుదల చేశారు. రామ్ నటించిన సినిమాలు గతంలో కూడా హిందీ వెర్షన్ వ్యూస్ విషయంలో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాలకు ఈ రేంజ్ లో ఆదరణ దక్కుతోంది కాబట్టే హిందీ డబ్బింగ్ రైట్స్ కు భారీ ధర దక్కుతోంది.