లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడ్డాయి. షూటింగులు ఆగిపోయాయి. రిలీజ్ డేట్ ప్రకటించుకున్న సినిమాలు ఇప్పుడు లాబుల్లో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నాయి. ఈ పరిస్థితి ఓటీటీ వేదికలకు ప్లస్ అయ్యింది. థియేటర్లో సినిమాని విడుదల చేసుకోలేని పరిస్థితి వస్తే... ఓటీటీ తప్ప మరో దిక్కులేదు. థియేటర్లు ఎప్పుడు ప్రారంభిస్తారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈలోగా చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. వాటిని తట్టుకునే శక్తి చిన్న నిర్మాతలకు లేదు. అందుకే వచ్చిన కాడికి సినిమాని ఓటీటీలకు అమ్ముకోవాలని డిసైడ్ అవుతున్నారు.
అందులో భాగంగా `అమృతారామమ్` సినిమా థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీ లో విడుదల అవుతోంది. ఈ నెలాఖరున 'జీ 5'లో ఈ చిత్రాన్ని ప్రదర్శనకు ఉంచుతారు. వీటితో పాటు కనీసం 20 సినిమాలు వివిధ ఓటీటీ సంస్థలకు అమ్ముడుపోయాయని, వాటి వివరాలు ఒకొక్కటిగా బయటకు రానున్నాయని తెలుస్తోంది. కొత్తవాళ్లతో తెరకెక్కించిన సినిమాల్ని కొనడానికి ఓటీటీ సంస్థలు కూడా ముందుకు రావడం లేదు. దాంతో...` వచ్చిన రాబడిలో చెరి సగం తీసుకుందాం` అనే ప్రతిపాదన ప్రకారం.. సినిమాల్ని ఓటీటీ సంస్థలకు ఇచ్చేస్తున్నారు. అలా... ఓటీటీ సంస్థలు తమ సినిమాల బ్యాంకుల్ని పెంచుకుంటున్నాయి. కానీ ఆ సినిమాలపై కోట్లు ధారబోసిన నిర్మాతలకు ఒట్టి చేతులు మిగులుతున్నాయి. లాక్ డౌన్ ఎత్తేసి, థియేటర్లకు పచ్చజెండా ఊపితే గానీ, నిర్మాతల కష్టాలు తీరవు.