మీ..టూ.. వివాదంలో ప్రముఖ తమిళ హీరో శింబు ఇరుక్కున్నాడు. ఓ సినిమా షూటింగ్ సమయంలో తాను లైంగిక వేధింపుల్ని ఎదుర్కొన్నానంటూ లేఖా వాషింగ్టన్ ఆరోపించింది. తెలుగులో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 'వేదం' సినిమాలో మంచు మనోజ్ సరసన లేఖా వాషింగ్టన్ నటించిన సంగతి తెల్సిందే.
తమిళంలో కూడా ఆమె ఒకట్రెండు సినిమాలు చేసింది. అందులో శింబు సరసన ఓ సినిమా చేసింది లేఖా వాషింగ్టన్. షూటింగ్ సమయంలో లైంగిక వేధింపుల్ని ఎదుర్కొన్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్న లేఖ, ఎవరు తనను వేధింపులకు గురిచేశారో మాత్రం చెప్పలేదు. దాంతో శింబు తరఫున, ఆయన ఆఫీస్ సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో చాలామంది వున్నారనీ, ఆమెను ఎవరు వేధింపులకు గురిచేశారో తెలియాల్సి వుందనీ, శింబు తరఫున అలాంటి వేధింపులు ఏమీ లేఖా వాషింగ్టన్ ఎదుర్కొని వుండదని క్లారిటీ ఇచ్చారు ఆ ప్రకటనలో.
మరోపక్క తమ అభిమాన హీరోపై బురద జల్లుతోందంటూ శింబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా, లేఖా వాషింగ్టన్‌పై మండిపడుతున్నారు. శింబు అభిమానుల ఓవరాక్షన్‌పై లేఖా వాషింగ్టన్ అసహనం వ్యక్తం చేస్తోంది. తొలుత వేధింపుల గురించి చెప్పి, ఆ తర్వాత సినిమా పేరు కూడా ప్రకటించిన లేఖ, తనను వేధింపులకు గురిచేసిన వ్యక్తి పేరునీ బయటపెట్టే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
ఇప్పటికే తమిళ సినీ పరిశ్రమ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెల్సిందే. కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్, అర్జున్‌పై ఆరోపణలు చేసింది. వాటిని అర్జున్ ఖండించడం కూడా జరిగిపోయింది.