ఒకప్పటి పోర్న్ స్టార్ సన్నీలియోన్‌కి బెంగళూరు అంటే 'బెంగ' తప్పడంలేదు. ముంబైలో తొలిసారి అడుగు పెట్టినప్పుడు ఆమె కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నా, ఇప్పుడామె ముంబైలోనే స్థిరపడిపోయింది. 'పోర్న్ స్టార్' అనే ఇమేజ్ చెరిపేసుకోలేదుగానీ, అంతకు మించిన 'బాలీవుడ్ భామ' అనే గుర్తింపు తెచ్చుకోవడంతో, ముంబైలో ఆమెకు ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఓసారి కేరళకు ఆమె వెళితే అక్కడ జనం పోటెత్తారు. తెలుగులో రెండు సినిమాలు కూడా చేసింది సన్నీలియోన్. దేశంలో ఎక్కడ తిరిగినా ఇబ్బందుల్లేవుగానీ, సన్నీలియోన్‌కి మాత్రం బెంగళూరు కలిసిరావడంలేదు. గత ఏడాది డిసెంబర్ 31 రాత్రి 'న్యూ ఇయర్ వేడుకల' కోసం సన్నీలియోన్‌తో మాంఛి ఘాటైన ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది ఓ సంస్థ. కానీ, ఆ ప్రోగ్రామ్‌కి ఆమెను రానివ్వలేదు బెంగళూరులో ఆందోళనకారులు.
తాజాగా 'వీరమహాదేవి' సినిమాలో ఆమె పాత్రను వ్యతిరేకిస్తూ, సన్నీలియోన్‌కి వ్యతిరేకంగా ఆందోళనేలు బెంగళూరులో జరుగుతున్నాయి. నవంబర్ 3న బెంగళూరులో ఓ ఫన్ ఈవెంట్, సన్నీలియోన్‌తో ప్లాన్ చేస్తే, 'ఆ ప్రోగ్రామ్‌కి రావొద్దు' అంటూ హెచ్చరికలు జారీ చేశారు. 'నా వల్ల ఆందోళనలు జరగడం ఇష్టం లేదు.. అందుకే నేను బెంగళూరుకి రావడంలేదు..' అని గతంలో న్యూ ఇయర్ వేడుకల విషయంలో చెప్పిన సన్నీలియోన్, ఈసారి ఏం చేస్తుందోగానీ, వస్తే మాత్రం తీవ్ర వ్యతిరేకత తప్పదని హెచ్చరిస్తున్నారు ఆందోళనకారులు.
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో 'వీర మహాదేవి' సినిమా రూపొందుతోంది. కన్నడ వీర వనితగా 'వీరమహాదేవి'ని పూజిస్తారు. ఆ పాత్రలో పోర్న్ స్టార్ నటించడమేంటన్నది కన్నడ సంఘాల ఆవేదన.