ఓ స్టార్ హీరో సినిమా హిట్టయితే.. బాక్సాఫీసు బద్దలైపోతుంది. వసూళ్ల వర్షం కురుస్తుంది. నిర్మాతలు లాభాల్లో మునిగితేలుతారు. పొరపాటున ఫ్లాప్ అయితే.. ఆ నష్టాల్ని ఊహించలేం.
భారీ అంచానాలతో వచ్చిన సినిమాలు పల్టీ కొడితే... నిర్మాతలు, బయ్యర్లూ నెత్తిమీద తడి గుడ్డ వేసుకోవడమే. లైగర్ విషయంలోనూ అదే జరిగింది. పూరి జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఇది.
దాదాపుగా రూ.150 కోట్లు ఖర్చు పెట్టారు. 200 కోట్ల రికవరీ వస్తుందని ఆశించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని రూ.90 కోట్లకు అమ్మేశారు. అయితే.. ఇప్పటి వరకూ ఈ సినిమాకి కేవలం 30 కోట్లు మాత్రమే వచ్చాయి. అది కూడా ఓపెనింగ్ డే.. వసూళ్లు అదిరిపోవడం వల్ల. అడ్వాన్సు బుకింగుల మోతతో.... తొలి రోజు టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు వచ్చాయి. రెండో రోజుకే... థియేటర్లు చతికిల పడిపోయాయి. దాంతో ఇప్పటి వరకూ ఈ సినిమాకి రూ.30 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే రూ... 60 కోట్ల లాస్ అన్నమాట. నైజాంలో తొలి రోజు రూ.4.5 కోట్లు తెచ్చుకొన్న లైగర్... ఆ తరువాతి 4 రోజులకు గానూ మరో కోటిన్నర మాత్రమే సంపాదించిందంటే.... కలక్షన్లు ఎంత దారుణంగా పడిపోయాయో అర్థం చేసుకోవొచ్చు. ఓవర్సీస్‌లో లైగర్ కంటే... దానికంటే ముందు విడుదలైన సీతారామం సినిమాకే వసూళ్లు ఎక్కువ కనిపిస్తున్నాయి.
నార్త్ లో ఈ సినిమా కుమ్మేస్తుంది.. అక్కడ వంద కోట్లు తెచ్చుకుంటుందని అంతా ఆశించారు. అక్కడ వంద కోట్లు తెచ్చుకుంటుందని అంచనా వేశారు. కానీ తీరా చూస్తే ఇప్పటి వరకూ 7 కోట్లు మాత్రమే వచ్చాయి.