ఇప్పుడు ఎవరి నోట విన్నా.. లైగర్ మాటే. లైగర్ ఎందుకు ఫ్లాప్ అయ్యింది? ఎక్కడ తప్పు జరిగింది? అనే విషయాల గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ట్రేడ్ వర్గాలు సైతం ఈ సినిమా వల్ల ఎంత నష్టం వచ్చిందో లెక్కగట్టే పనిలో బిజీగా ఉంది. సోమవారానికి అసలు లెక్కలు బయటపడిపోతాయి. ఈ సినిమాని కొనడానికి అప్పట్లో ఓటీటీ సంస్థ ముందుకు వచ్చింది. రూ.200 కోట్లకు బేరం కుదిరిందని, అయితే.. పూరి, చార్మిలు దానికి ఒప్పుకోలేదని వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ కూడా ట్విట్టర్‌లో గుర్తు చేశాడు. ''200 కోట్లా.. మా సినిమాకి అంత కంటే ఎక్కువ వస్తుంది'' అంటూ అప్పట్లోనే ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ పాత ట్వీట్ వైరల్ అవుతోంది.
ఈ సినిమాని అప్పుడే రూ.200 కోట్లకు అమ్మేసినా, బాగుండేది కదా.. ఓవర్ కాన్షిడెన్స్‌కి పోయి, డబ్బులు పోగొట్టుకొన్నారంటూ... కామెంట్లు విసురుతున్నారు నెటిజన్లు.
నిజానికి లైగర్ సినిమాకి రూ.200 కోట్ల ఆఫర్ అంటే చాలా పెద్ద మొత్తమే. ఈ సినిమాకి రూ.150 కోట్ల వరకూ ఖర్చయ్యింది. అప్పుడు అమ్మేసినా ఏకంగా 50 కోట్ల లాభం వచ్చేది. కానీ.. పూరి, ఛార్మిలు అందుకు ఒప్పుకోలేదు. ఈ సినిమాపై పూరి కంటే ఛార్మికే ఎక్కువ నమ్మకం ఉండేది. ఛార్మినే ఈ సినిమాని ఓటీటీకి ఇవ్వకుండా అడ్డుకుందని ఓ టాక్. అప్పట్లో పుష్ప, కేజీఎఫ్, ఆర్.ఆర్.ఆర్... బాలీవుడ్ లో సూపర్ హిట్లు కొట్టి.. వందల కోట్లు వసూలు చేశాయి. ఆ నమ్మకంతోనే `లైగర్`ని థియేటర్లలో విడుదల చేయాలని భావించాడు పూరి. లైగర్ సౌత్‌లో తప్పకుండా క్లిక్ అవుతుందని గుడ్డిగా నమ్మారు. కానీ ఆ నమ్మకాలు నిజం కాలేదు.