ఇప్పుడిక అధికారం.. ఏప్రిల్ నెలంతా లక్‌డౌన్ కొనసాగుతుంది. మే 3 వరకు లాక్‌డౌన్‌ని కేంద్రం పొడిగించింది. సో, ఏప్రిల్ నెలాఖరులోగా అయినా ఒకటీ అరా సినిమాలు విడుదలయ్యేందుకు ఆస్కారమే లేదు. సినిమాల రిలీజ్‌ల సంగతి తర్వాత, ఆగిపోయిన షూటింగ్‌లు కూడా మొదలయ్యే పరిస్థితి లేదు. ఆ మాటకొస్తే, మే నెలలో అయినా ‘వెసులుబాటు’ దొరుకుతుందన్న ఆశ ఇప్పుడు లేకుండా పోతోంది. దేశంలో కరోనా వైరస్ ప్రకంపనలు మరింత తీవ్రమవుతున్న దరిమిలా, ఈ వేసవి సీజన్‌ని సినీ పరిశ్రమ పూర్తిగా మిస్ అవడం ఖాయం. మనిషి ప్రాణం కన్నా ఏదీ విలువైనది కాదు. అందుకే, సినీ పరిశ్రమ ఇప్పటికే సినిమా షూటింగుల్ని వాయిదా వేసేసుకుంది.
సినిమా రిలీజ్‌లూ ఆగిపోయాయి. ఇంకోపక్క, సినీ పరిశ్రమ ప్రముఖులు తమ పెద్ద మనసు చాటుకుంటున్నారు విరాళాలు ప్రకటించడం ద్వారా. విరాళాలు ప్రకటించడమొక్కటే కాదు, కరోనా వైరస్ పట్ల అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు వివిధ మార్గాల్లో. పరిస్థితులు పూర్తిగా చక్కబడాలనీ, తిరిగి ప్రేక్షకుల్ని అలరించేందుకు అనుకూలంగా వాతావరణం మారాలనీ సినీ పరిశ్రమ ఆశిస్తోంది. అయితే, అదంతా ఇప్పుడే కాదు.. ఇంకాస్త సమయం పడుతుంది. అదెంత సమయం.? అన్నది ఇప్పుడే చెప్పలేం. ఈలోగా సోషల్ మీడియా ద్వారా సినీ అభిమానుల్ని సినీ ప్రముఖులు అలరిస్తూనే వుంటారు.