ఈమధ్య కాలంలో... ఎప్పుడూ లేనంతగా థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు చూస్తున్నామంటే అదంతా లవ్ స్టోరి చలవే. విడుదలకు ముందు నుంచీ ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్. శేఖర్ కమ్ముల సినిమా అవ్వడం, ఫిదా తరవాత సాయి పల్లవితో కాంబినేషన్ కావడం, మరీ ముఖ్యంగా యూత్ కి నచ్చే సబ్జెక్ట్ అవ్వడంతో.. లవ్ స్టోరిపై అటెన్షన్ పెరిగింది. అనుకున్నట్టుగానే లవ్ స్టోరి మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీసు దగ్గర వసూళ్లతో హోరెత్తిస్తోంది. ఓవర్సీస్ లోనూ దూసుకుపోతోంది.
సినిమా బాగున్నా - క్లైమాక్స్ విషయంలో ప్రేక్షకుడు కాస్త అసంతృప్తికి లోనవుతున్నాడు. క్లైమాక్స్ అంతా కంగాళీగా ఉందని, అది హ్యాపీ ఎండింగ్ కీ, యాంటీ క్లైమాక్స్ కీ మధ్యన ఉందన్న విమర్శలు వినిపించాయి. నిజానికి ఈ సినిమాలో క్లైమాక్సే వీక్. క్లైమాక్స్ మార్చి ఉంటే - ఈ సినిమా స్థాయి ఇంకాస్త పెరిగేది. అయితే.. క్లైమాక్స్ గురించి రకరకాల చర్చలు జరిగాయట. ముందు శేఖర్ కమ్ముల యాంటీ క్లైమాక్స్‌నే తీద్దామనుకున్నాడని సమాచారం. ఆల్రెడీ అలాంటి వెర్షన్ కూడా తీశార్ట. అయితే `శ్రీదేవి సోడా సెంటర్ `కూడా అలాంటి కథతోనే నడిచింది.
చివర్లో యాంటీ క్లైమాక్స్ తీయడంతో ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. ఈ సినిమాలోనూ అలాంటి క్లైమాక్సే డిజైన్ చేస్తే - ఆ సినిమాని కాపీకొట్టినట్టు అవుతుందని శేఖర్ కమ్ముల భావించాడట. అందుకే క్లైమాక్స్ ని మార్చాడని తెలుస్తోంది. ఇప్పుడు చూస్తున్న క్లైమాక్స్ కి కూడా చాలాసార్లు రిపేర్లు చేశార్ట. సినిమా విడుదలకు ముందు కూడా క్లైమాక్స్ మార్చి తీయడంతో , చివరికి అది కంగాళీగా మారిందని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ముందనుకున్న క్లైమాక్స్ తీసి ఉంటే, ఫలితం ఎలా ఉండేదో?