శేఖర్ కమ్ముల - లవ్ స్టోరి టాలీవుడ్ కి కొత్త ఊపిరి పోసింది. ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు... నిర్మాతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. వసూళ్ల లెక్క పక్కన పెడితే, ఈ సినిమా గురించి చర్చ మొదలైంది. నాగ చైతన్యలో ఓ కొత్త తరహ నటుడ్ని చూశామని అభిమానులు కితాబు ఇస్తున్నారు. మెట్రోలో సాయి పల్లవి ముద్దు పెట్టే సీన్, అక్కడ చైతూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఈ సినిమాకే హైలెట్. అయితే ఆ సీన్ తీయడానికి చాలా కష్టపడాల్సివచ్చింది. తెరపై 30 సెకన్లు కూడా లేని ఆ సీన్ తీయడానికి ఏకంగా ఆరు గంటల సమయం పట్టిందట.
ముఖ్యంగా చైతూ కన్నీళ్లతో ఆ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడానికి చాలా సమయం తీసుకున్నాడట. పైగా మెట్రోలో సీన్ అది. అయినా .. శేఖర్ కమ్ముల తనకు కావల్సిన ఎక్స్‌ప్రెషన్ వచ్చేంత వరకూ ఓపిగ్గా ఎదురు చూశాడు. సాయి పల్లవిలో ఓ ఉత్తమ నటి ఉందని ఎప్పుడో తెలిసిపోయింది. ఇప్పుడు నాగ చైతన్యలోని మేటి నటుడ్ని శేఖర్ బయటకు తీశాడు. ఇలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు పడిన కష్టం మొత్తం మర్చిపోతారు. శేఖర్ కమ్ముల కష్టానికి ప్రతిఫలం దక్కినట్టే.