కరోనా కారణంగా మూతబడ్డ సినిమా ధియేటర్లు సంక్రాంతి పుణ్యమా అని తెరుచుకున్నాయి. సంక్రాంతికి విడుదలైన మూడు, నాలుగు సినిమాలతో పండగ నాలుగు రోజులు ధియేటర్లు కళకళలాడాయి. సంక్రాంతి సీజన్ ముగిసింది. జనం ఫెస్టివల్ మూడ్ నుండి బయటికొచ్చేశారు. వారి వారి పనుల్లో బిజీ అయిపోయారు. ఇంకేముంది. మళ్లీ సీన్ మొదటకొచ్చింది. ధియేటర్లు వెలవెలబోతున్నాయి. మినిమమ్ ప్రేక్షకులు కూడా లేక ధియేటర్ ఓనర్లు లబోదిబోమంటున్నారు.
పరిస్థితి ఇలాగే ఉంటే, తమ పరిస్థితి ఏంటనీ తలలు బాదుకుంటున్నారు. కరోనా నుండి తేరుకుని ప్రపంచం ఆర్ధిక పరంగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. అన్ని రకాల బిజినెస్‌లూ ఓ మాదిరి కొలిక్కి వచ్చాయి. కానీ, సినిమా మాత్రం ఇంకా గాడిన పడలేదు. కొత్త సినిమాలు ఇప్పుడిప్పుడే షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. కానీ, అది చాలదు అసలు సినిమా సందడి మొదలయ్యిందనడానికి. పెద్ద సినిమాలు విరివిగా విడుదలవ్వాలి. బాక్సాఫీస్ కళకళ్ళాడాలి. అన్నిటికీ మించి సగం ఆక్యుపెన్సీ నిబంధన తొలగిపోవాలి.
సంక్రాంతి కళకళ్ళాడిందని సంతోషించేలోపు.. సంక్రాంతి సీజన్ ముగిసిపోయింది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. దాంతో సినీ పరిశ్రమలో మళ్ళీ అలజడి మొదలయ్యింది. తాజాగా విడుదలైన ‘బంగారు బుల్లోడు’ పరిస్థితి దయనీయంగా తయారయ్యింది. అసలే పరీక్షల సీజన్ మొదలవుతోంది. టాలీవుడ్ భవిష్యత్తు ఏమవుతుందో ఏమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.