స్టార్ హీరోయిన్ల పారితోషికం ఎంత? అని అడక్కండి. గుండాగిపోతుంది. ఆ స్థాయిలో ఉన్నాయి అంకెలన్నీ. ఈమధ్య ఓ తమిళ సినిమా కోసం పూజా హెగ్డే ఏకంగా 3 కోట్లు తీసుకుందన్న వార్త కోలీవుడ్ అంతా చక్కర్లు కొడుతోంది. ఈ విషయంలో పూజా హెగ్డే నయనతారని దాటేసిందని చెవులు కొరుక్కుంటున్నారంతా. అయితే.. పూజాకి ఇంతింత పారితోషికం ఇవ్వడం విడ్డూరం ఏమీ కాదు. ఎందుకంటే తన తొలి సినిమాకే ఏకంగా 30 లక్షలు అందుకుందట.
ఈ విషయం తానే చెప్పింది. ఆ డబ్బుతో ఓ బీఎండబ్ల్యూ కారుకూడా కొందట. ఆ కారు ఇప్పటికీ తన దగ్గర ఉందని, తన తొలి పారితోషికంతో కొన్న వస్తువు కాబట్టి, అదంటే తనకు ప్రాణమని చెబుతోంది పూజా. ఎలాంటి నేపథ్యమూ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి, తొలి సినిమాకే 30 లక్షలు అందుకుందటే... పూజాది మామూలు జాతకం కాదు. ప్రస్తుతం రాధే శ్యామ్ లో నటిస్తోంది పూజా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా విడుదలకు రెడీగా ఉంది. ఈ రెండు సినిమాలూ ఈ సీజన్‌లోనే రాబోతున్నాయి.