రామాయణం అంటే, శ్రీరాముడి అరణ్యవాసం, ఆ తర్వాత పట్టాభిషేకం మాత్రమే కాదు. అందులో చాలా అంశాలుంటాయి. చాకలి నింద నేపథ్యంలో భార్యకు అగ్ని పరీక్ష పెట్టిన శ్రీరాముడు విమర్శల పాలయ్యాడు. లవకుశలు తండ్రికి దూరంగా పెరిగారు. ఇవన్నీ శ్రీరాముడి జీవితంలోనివే. ఉత్తమ పురుషుడైన రాముడ్ని 'హీరో'గా చూడటంతోనే సరిపెట్టేస్తామంటే కుదరదు కదా! పరిస్థితులు, వాటి ప్రభావంతోనే ఆయా వ్యక్తుల ఘనతలు, వైఫల్యాలు ముడిపడి వుంటాయి. ఆ పరిస్థితులకు తగ్గట్టుగానే ఆయా వ్యక్తుల్లోని భిన్న కోణాలు బయటకు వస్తుంటాయి.
రామాయణంతో పోల్చడం అని కాదుగానీ, రామాయణ ప్రస్తావన తీసుకురావడం ద్వారా ప్రముఖ సినీ పాటల రచయిత సిరాశ్రీ, నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర గురించి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు.. తారక'రామా'యణంపై అందర్నీ ఆలోచనలో పడేస్తున్నాయి. కొత్త తరానికి ఎన్టీఆర్ జీవితంలోని అన్ని కోణాలూ తెలియకపోవచ్చుగాక.! కానీ, ఆయన జీవితం తెరచిన పుస్తకం. తెలుసుకోవాలనుకుంటే, అదేమంత పెద్ద కష్టమైన విషయం కాదు. సినీ నటుడిగా ఆయన తిరుగులేని స్టార్డమ్ సంపాదించారు. రాజకీయ నాయకుడిగా, అంతకంటే పెద్ద ఇమేజ్ దక్కించుకున్నారు. కానీ, చివరి రోజుల్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్ని చవిచూశారు.
నాయకత్వ మార్పు అనండీ, వెన్నుపోటు అనండీ.. ఆ నాటి ఆ ఘటనకు చంద్రబాబు కేంద్ర బిందువు. లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చాకే ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపార్వతి పెత్తనం ప్రారంభమయ్యాకే అసలు కుదుపు మొదలైంది. ఇవన్నీ వాస్తవాలు. చంద్రబాబు కోణంలో చూస్తే ఒకలా, ఎన్టీఆర్ కోణంలో చూస్తే మరొకలా, లక్ష్మీపార్వతి కోణంలో చూస్తే ఇంకొకలా కన్పించొచ్చు. ఈ విషయాలన్నిటినీ పరోక్షంగా సిరాశ్రీ సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ, 'మీరేమంటారు కళ్యాణి మాలిక్గారూ..' అని ప్రశ్నించడం ఇప్పుడు వైరల్గా మారింది.
క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టిఆర్ కథానాయకుడు', 'ఎన్టిఆర్ మహానాయకుడు' రూపొందుతుండగా, అందులో ఎన్టీఆర్ చివరి రోజులు కన్పించే అవకాశం లేదని సమాచారమ్. రామ్గోపాల్ వర్మ రూపొందిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మాత్రం, ఆ కీలకమైన 'కాలం' చుట్టూనే వుంటుంది.