సినిమా అనేది వినోద సాధనమే. అయితే కొంతమంది వాటిని చూసే పద్ధతే వేరుగా ఉంటుంది. సినిమా వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు అందకూడదని భావిస్తుంటారు. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా - అదో గొడవ. అందుకే సినిమాలపై అప్పుడప్పుడూ వివాదాలు ముసురుతుంటాయి. తాజాగా దర్టీ హరీ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది.
ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిచిన చిత్రం... డర్టీ హరి. రుహాని శర్మ, శ్రవణ్ రెడ్డి, సిమత్ర కౌర్ తదితరులు నటించారు. ఈనెల 18న విడుదల చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. అయితే తాజాగా డర్టీ హరి నిర్మాతపై కేసు నమోదైంది.
వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో ఫిల్లర్ పై అతికించిన సినీ పోస్టర్ల పై కేసు నమోదు చేసారు పోలీసులు. స్త్రీ గౌరవాన్ని అవమానించేలా...యువతను తప్పుదోవ పట్టించే రీతిలో డర్టీ హరీ సినిమా పోస్టర్లు ఉన్నాయని సినీ నిర్మాత శివరామకృష్ణ తో పాటు పబ్లిషింగ్ ఏజెన్సీ ల పై సుమోటో కేసు నమోదు చేసారు జూబ్లీహిల్స్ పోలీసులు. టీజర్. ట్రైలర్ల విషయంలోనూ కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా థియేటర్లో విడుదల అవ్వడం లేదు. ఏటీటీ ద్వారా వస్తోంది. థియేటర్లలో అయితే.. థియేటర్ల దగ్గర నిరసన తెలపొచ్చు. టికెట్లు అమ్మకుండా అడ్డుకోవొచ్చు. ఏటీటీలో ఈ సినిమాని అడ్డుకోవడం అసాధ్యమే.