దేశ రాజకీయాలకన్నా `మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) లో రాజకీయాలు వాడీ వేడీగా సాగుతున్నాయి. రోజూ ఏదో ఓ రచ్చ. తాజాగా.. హేమ చేసిన వ్యాఖ్యలు `మా` వర్గాల్లో కలలకం సృష్టిస్తున్నాయి. `మా` ఎన్నికలు వెంటనే జరిపించాల్సిందని కోరుతూ `మా` సభ్యులకు లేఖ పంపింది హేమ. దీంతో పాటు ఓ వీడియో నోట్ కూడా విడుదల చేసింది.
అందులో సారాంశం క్లుప్తంగా ఏమిటంటే... మా అధ్యక్షుడు నరేష్ కుర్చీని పట్టుకుని వేలాడుతున్నారని, ఆయనకు ఎన్నికలు నిర్వహించడం ఏమాత్రం ఇష్టం లేదని, ఆయనే అధ్యక్షుడిగా కొనసాగాలనుకుంటున్నారని.. వగైరా, వగైరా. అంతకు మించి - మాలో 5 కోట్ల నిధులు ఉంటే, నరేష్ తన హయాంలోనే రూ.3 కోట్లు ఖర్చు పెట్టించారని, మెడికల్ ఇన్సురెన్సులు, ఆఫీసు ఖర్చులకు 3 కోట్లు అయ్యిందని చూపించారని, గతంలో అధ్యక్షుడిగా ఎవరు పనిచేసినా, మెడికల్ ఇన్సురెన్సుల నిమిత్తం - బయట నుంచి ఫండ్స్ తీసుకొచ్చేవారని, నరేష్ మాత్రం దర్జాగా ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టేసి, మాకి నిధులే లేకుండా చేస్తున్నారన్నది హేమ ఆరోపణ.
ఈ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. నరేష్ పై ఎంత నెగిటివిటీ ఉందో చెప్పడానికి హేమ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలే.. సాక్ష్యాలు. అయితే ఇవి కేవలం ఆరోపణలేనా? ఇందులో నిజాలేమైనా ఉన్నాయా? అనేది తెలియాలంటే అసలు లెక్కలు బయటకు రావాలి. లేదంటే.. నరేష్ స్వయంగా రంగంలోకి దిగి లెక్కలు చెప్పాలి. మరి నరేష్ ఏమంటాడో?