'మా' సంక్షోభం ముదిరి ముదిరి పాకాన పడుతోంది. నరేష్ వ్యవహార శైలి పట్ల మా సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో... ;'మా' అత్యవసర భేటీ జరిగింది. ఈ సమావేశానికి నరేష్ గైర్హాజరు అయ్యారు. అంతేకాదు.. `నేను లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారు` అంటూ సీరియస్ కూడా అయ్యారు. కానీ.. `మా` సభ్యులు ఇవేం పట్టించుకోవడం లేదు. ఇటీవల `మా` ఎన్నికలలో నరేష్ గెలిచి, అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే మా కార్యనిర్వాహక వర్గంలో విబేధాలు తలెత్తాయి. నరేష్ ఒంటెద్దు పోకడతో నిర్ణయాలు తీసుకుంటున్నారని, మిగిలిన సభ్యులతో ఏమాత్రం చర్చించడం లేదని కొంతమంది నిరసన వెల్లగక్కారు. అందులో ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన రాజశేఖర్ కూడా ఉన్నారు. ఇప్పుడురాజశేఖర్ వర్గానికి మద్దతు ఎక్కువైంది. నరేష్ పదవీ కాలం రెండేళ్లు. అయితే ఈ లోగా ఆయన్ని అధికార పీఠం నుంచి తొలగించాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఓ అధ్యక్షుడిని పదవి నుంచి తప్పించొచ్చా? అందుకు ఎలాంటి మార్గాన్ని అనుసరించాలని అనే విషయంలో ఇప్పుడు `మా` సభ్యుల మధ్య తీవ్ర చర్చలు సాగుతున్నట్టు సమాచారం. సో... నరేష్ అద్యక్ష పదవికి ముప్పు వాటిల్లిందన్నమాట. ఈ ప్రమాదం నుంచి ఆయన ఎలా తప్పించుకుంటారో చూడాలి.