మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మరోసారి వివాదాల్లోకెక్కింది. ఇటీవల విదేశాల్లో నిర్వహించిన ఓ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులు కొందరు సినీ పెద్దల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపణలు రావడం, ఈ ఆరోపణలన్నీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శివాజీరాజాని టార్గెట్ చేయడంతో తెలుగు సినీ పరిశ్రమ కలవరపాటుకు గురైంది.
ఇటీవల కాలంలో టాలీవుడ్‌కి సంబంధించి ఇది మూడో అతిపెద్ద వివాదంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. శ్రీరెడ్డి ఎపిసోడ్, విదేశాల్లో సినీ తారల సెక్స్ రాకెట్ తదితర వివాదాలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్రమైన ప్రకంపనలు సృష్టించాయి. తాజా వివాదం వాటిన్నింటికీ మించిన ప్రకంపనలకు కారణమైంది. ఈ నేపథ్యంలో శివాజీరాజా మరికొందరు 'మా' సభ్యులు మీడియా ముందుకు వచ్చారు.
ఒక్క రూపాయి కూడా పక్క దారి పట్టలేదనీ సమాచారమిచ్చారు. శివాజీరాజాపై ఆరోపణలు చేస్తున్నవారు, ఆ ఆరోపణలకు తగ్గ ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. అంతేకాదు, ఒక్క రూపాయి పక్కదారి పట్టిందని ఎవరైనా నిరూపిస్తే, మొత్తంగా తన ఆస్థిని రాసిచ్చేస్తాని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు శివాజీరాజా. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున ఓ భవనాన్ని నిర్మించేందుకు విధుల సమీకరణ జరుగుతోంది. రెండు కోట్ల రూపాయలు ఇవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు.
తాజా వివాదం నేపథ్యంలో 'మా' వ్యవస్థాపక అధ్యక్షుడైన చిరంజీవి, జరుగుతున్న పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా, ప్రస్తుత టీమ్ అప్రమత్తంగా ఉండాలని సంస్థకు చెడ్డ పేరు రాకుండా చూడాలని కోరినట్లు తెలుస్తోంది.