ఈసారి మా ఎన్నికలు సాధారణ ఎన్నికలని తలపించాయి. పరస్పర ఆరోపణలతో ప్రచారాల్ని హోరెత్తించారు. వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం తో `మా` ప్రతిష్ట కాస్త మసకబారింది. పోలింగ్ రోజునా... వాడీ వేడీ తగ్గలేదు. హేమ.. శివ బాలాజీ చేయి కొరికేయడం ఈ మొత్తం ఎపిసోడ్ కే హైలెట్. అయితే ఈఎన్నికలలో భారీగా ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఓ ప్యానల్ దాదాపు ఆరేడు సార్లు `మా` సభ్యులకు విందు ఇచ్చింది. ఒకొక్క విందు కోసం 5 నుంచి 8 లక్షల వరకూ ఖర్చయ్యిందని టాక్. అంటే అక్కడే 40 లక్షల వరకూ లెక్క తేలిందన్నమాట.
మా ఓటర్లు వివిధ రాష్ట్రాలలో ఉన్నారు. దూర ప్రాంతం నుంచి వాళ్లు రావడం చాలా కష్టం. అందుకే అలా ఎవరెవరు సిటీకి దూరంగా ఉన్నారో, వాళ్లందరినీ గుర్తించి వాళ్లకు ఫ్టైట్ టికెట్లు వేసి, హైదరాబాద్ రప్పించారు. అంతేకాదు.. స్టార్ హోటెళ్లలో వాళ్లకు బస ఏర్పాటు చేశారు. ఇలా విమాన టికెట్లకీ, హోటెళ్లకీ కనీసం 15 లక్షలైనా అయ్యిందని సమాచారం.
మొత్తంగా ఎటు చూసినా ఓ ప్యానల్ ఈ ఎలక్షన్ల కోసం కోటి రూపాయలు ఖర్చు చేసిందని తెలుస్తోంది. నిజంగా... ఇది భారీ మొత్తమే. మొత్తం చూస్తే 600 ఓట్లు నమోదైన ఈ ఎన్నికల కోసం ఓ వర్గం కోటి రూపాయలు ఖర్చు చేసిందంటే.. ఇంతకు మించి రికార్డు ఏముంటుంది?