'మా' రెండుగా చీలిపోతోందని, ఆల్ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ (ATMAA) పేరుతో మరో కొత్త సంఘం ఏర్పడుతుందని, దీనికి ప్రకాష్ రాజ్ సారథ్యం వహిస్తారని వార్తలొచ్చాయి. మా ఎన్నికలు వాడీ వేడీగా జరిగిన నేపథ్యంలో, ప్రకాష్ రాజ్‌ప్యానల్ లో గెలిచినవాళ్లంతా రాజీనామా చేసిన నేపథ్యంలో... ATMAA ఏర్పాటు ఖాయం అనుకున్నారంతా. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం అలాంటిదేం లేదని తేల్చేశారు. `మా` సభ్యుల కోసం పాటు పడతామని, తప్పు జరిగితే ప్రశ్నిస్తామని, అయితే ఇదంతా మా కి బయట ఉండే చేయగలమని అన్నారు.
నిజానికి ATMAA ప్రారంభించాలన్న ఆలోచన ప్రకాష్ రాజ్ బృందానికి వచ్చిందని, అయితే..చివరి క్షణాల్లో ఆ ప్రయత్నం విరమించుకున్నారని సమాచారం. తమ ఉద్దేశ్యాన్ని చిరంజీవి దగ్గరకు ప్రకాష్ రాజ్ బృందం తీసుకెళ్లారని, అయితే చిరు మాత్రం వారించారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో సంఘం ఏర్పాటు చేస్తే - టాలీవుడ్ నటీనటుల పరువు పోతుందని వెనక్కి లాగారని, అందుకే... ప్రకాష్‌రాజ్ ATMAA ఏర్పాటు చేయాలన్న ఆలోచన పక్కన పెట్టారని తెలుస్తోంది. చిరు గనుక ఓకే అంటే... ATMAA కి అంకురార్పణ జరిగిపోయేదే. `మా` ఫౌండర్ ప్రెసిడెంట్ గా, ఆ సంస్థ పరువుని కాపాడాల్సిన బాధ్యత చిరుకి ఉంది. తను మద్దతు ఇచ్చినవాళ్లంతా కలిసి మరో సంఘం ఏర్పాటు చేసే.. అది మాకి అప్రతిష్ట. అందుకే చిరు సున్నితంగా వారించి, ప్రకాష్ రాజ్ వెనకడుగు వేసేలా చేశారని టాక్.