హీరోకి సరిపడా కథ ని తయారు చేసుకోవడం కంటే, ఆ సినిమాలో విలన్ ని వెదికి పట్టుకోవడమే పెద్ద గగనం అయిపోతోంది నేటి దర్శకులకు. ఎందుకంటే.. హీరో, విలన్ల పాత్రలన్ని చాలా పకడ్బందీగా తయారు చేస్తున్నారు. పైగా పాన్ ఇండియా స్థాయిలో కథలు అల్లుతున్నారు కాబట్టి... విలన్ పాత్రకూ స్టార్ డమ్ ఉన్నవాళ్లనే ఎంచుకోవాల్సివస్తోంది. విలన్ లు దొరక్క చాలామంది దర్శకులు సతమతమవుతున్నారు.
అయితే రామ్ కి ఈ సమస్య ముందే తీరిపోయింది. తన సినిమాలో విలన్ ఇప్పటికే ఖరారు అయిపోయాడని టాక్. రామ్ తమిళ దర్శకుడు లింగు స్వామి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి రూపొందిస్తారు. రామ్ నేరుగా చేస్తున్న తమిళ సినిమా ఇదే. ఇందులో రామ్ పోలీస్ అధికారిగా కనిపిస్తాడని తెలుస్తోంది. విలన్ పాత్రకు తమిళ నటుడు మాధవన్ ని ఎంచుకున్నారని సమాచారం.
ఈ సినిమాని తమిళంలోనూ బాగా మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే తమిళ ప్రేక్షకుల కోసం మాధవన్ ని ఎంచుకున్నార్ట. అయితే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సివుంది.