హీరోలు, నిర్మాతలు, విలన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, డాన్స్ మాస్టర్లు, రచయితలు.. ఇలా అందరి చూపూ కెప్టెన్ కుర్చీవైపే ఉంటుంది. ఎప్పటికైనా `స్టార్ట్.. కెమెరా.. యాక్షన్` అనాలని కలలుకంటుంటారు. ఆ కుర్చీలో ఉన్న పవర్ అది. తాజాగా కథానాయికలు సైతం.. డెరక్షన్ వైపు ఆశగా చూస్తున్నారు. నివేదా థామస్ కూడా.. ఈ జాబితాలో చేరిపోయింది. తనకు డైరక్షన్ చేయాలని ఉంది.. అంటూ మనసులో మాట బయటపెట్టింది. ఎప్పటికైనా దర్శకురాలిగా తన పేరు తెరపై చూపిస్తా అంటోంది.
నివేదా.. డైరక్షన్ కోర్సు చేసింది. వివిధ విభాగాల గురించి క్షుణ్ణంగా అవగాహన చేసుకుంది. ఇప్పుడు కొన్ని కథలు కూడా రాస్తోందట. ``లాక్ డౌన్ నాకు బాగా సహాయం చేసింది. ఈ గ్యాప్ లో కొన్ని కథలు రాసుకున్నా. డైరెక్టర్ గా కొత్త అవతారం ఎత్తాలనుకుంటున్నా..`` అని చెప్పుకొచ్చింది నివేదా. అయితే దర్శకత్వం అంత ఈజీ కాదు. అదో తపస్సు. దర్శకురాలిగా మారిందంటే.. కథానాయిక పాత్రని పక్కన పెట్టాల్సిందే. మరి నటనకు నివేదా గుడ్ బై చెబుతుందా? లేదంటే రెండు పడవల ప్రయాణం చేస్తుందా? చూడాలి మరి.