డబ్బింగ్ సినిమాలతోనే తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో మాధవన్. తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు కానీ, కుదరలేదు. ఎట్టకేలకు 'సవ్యసాచి' సినిమాతో ఆ ముచ్చట తీర్చుకున్నాడు. అయితే రొమాంటిక్ హీరోగా పేరున్న మాధవన్‌ని 'సవ్యసాచి'లో విలన్‌గా మార్చేశాడు దర్శకుడు చందూ మొండేటి.
ఏదేమైతేనేం తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మూవీలో తన పాత్ర విలక్షణమైనది, విశిష్టమైనదిగా గుర్తుండిపోయే పాత్రను ఎంచుకున్నాడు మాధవన్. ఎంట్రీ అయితే జరిగిపోయింది. ఇకపై వరుసగా తెలుగులో సినిమాలు చేసేందుకు సై అంటున్నాడు మాధవన్. హీరోగానే కాదు, విభిన్న క్యారెక్టర్స్‌నీ ఎంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సంగతి అటుంచితే, హీరోగా, విలన్‌గా తెరపై పర్‌ఫామెన్స్ అదరగొట్గ్టేస్తున్న మాధవన్ ఇప్పుడు తెర వెనక కూడా తన సత్తా చాటబోతున్నాడు.
త్వరలో మాధవన్ డైరెక్టర్‌గా ఓ సినిమా రాబోతోంది. 'ది నంబీ ఎఫెక్ట్' సినిమా పేరు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. అనంత మహాదేవన్‌తో కలిసి మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. మాధవన్‌కి ఛాలెంజ్‌తో కూడిన పాత్ర ఇది. విదేశీ గూఢచారి అంటూ నంబీ నారాయణ్‌పై పలు కేసులు నమోదయ్యాయి. ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా, ఆ కేసుల్ని ఎదుర్కొని నిర్దోషిగా నిరూపించుకున్నారాయన. అలాంటి ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందనీ మాధవన్ అంటున్నారు.
మాధవన్ తెలుగులో నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రం రేపు అనగా నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగచైతన్య, నిధి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.