పెద్ద సినిమాల్ని లాక్కోవాలని ఓటీటీలు గట్టిగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కానీ నిర్మాతలు ససేమీరా అంటున్నారు. హీరోలూ అంతే. `మా సినిమా థియేటర్లో విడుదలైతేనే బాగుంటుంది` అని నొక్కి వక్కాణిస్తున్నారు. అయితే.. నితిన్ మాత్రం ఓటీటీకి జై కొట్టాడు. తన కొత్త సినిమా `మాస్ట్రో`ని ఓటీటీకి ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయాడు. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన చిత్రం `అంధాధూన్`. తెలుగులో `మాస్ట్రో`గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకుడు. తమన్నా కీలక పాత్రధారి.
ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారు. హాట్ స్టార్ ఈ సినిమాకి ఏకంగా 32 కోట్లకు కొనుగోలు చేసిందట. ఎలా చూసినా.. నిర్మాతలకు 5 కోట్ల వరకూ టేబుల్ ప్రాఫిట్ దక్కుతుంది. అందుకే ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేయాలని ఫిక్సయిపోయారు. `మాస్ట్రో` షూటింగ్ తుది దశకు చేరుకుంది.త్వరలోనే.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి, ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఓటీటీకి సినిమా ఇవ్వడానికి హీరోలు జంకుతుంటే.. నితిన్ మాత్రం ఆ ధైర్యం చేసేశాడు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.