అలనాటి మేటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం 'మహానటి' సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం నెక్ట్స్ శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ కూడా అత్యధిక స్థాయిలో అమ్ముడుపోయాయని సమాచారమ్. ఆ అమ్మకాలు ఊహించని స్థాయిలో జరిగాయని ట్రేడ్ పండితులు చెబుతున్న మాట. సినిమా ధియేటర్స్‌లో విడుదలైన 30 రోజుల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేసేందుకు రైట్ ఉంది.
సో మే నెల 9వ తేదీన బిగ్ స్క్రీన్స్‌లో సందడి మొదలెట్టిన 'మహానటి' మరి కొద్ది రోజుల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ అందుబాటులోకి రానుందన్న మాట. 'మహానటి' విజయం ఎవ్వరూ ఊహించనిది. అత్యద్భుతం, అమోఘం అనే మాటలు చాలా చిన్న మాటలైపోయాయి ఈ సినిమా విజయం ముందు. ఓ యంగ్ డైరెక్టర్ ఇంత గొప్ప చరిత్ర ఉన్న బయోపిక్‌ని డీల్ చేసిన విధానం అందర్నీ కట్టిపడేస్తోంది. ఓ బయోపిక్‌కి ఈ స్థాయిలో క్రేజ్ రావడం బహుశా ఇదే తొలిసారి కావచ్చునని భావిస్తున్నారు.
ఏదో ఒక రకంగా 'మహానటి' వార్తల్లో నిలుస్తోంది. సినిమా విడుదలై రోజులు గడుస్తున్నా, ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ బయోపిక్‌తో ముందు ముందు బయోపిక్స్ తెరకెక్కించే వారికి కూడా ధైర్యం, పట్టుదల వచ్చిందని చెప్పొచ్చు. ఈ ఇన్సిపిరేషన్‌తో చాలా మంది ప్రముఖుల బయోపిక్స్ దృశ్యరూపం దాల్చే అవకాశాలు లేకపోలేవు. ఫిల్మ్ నగర్‌లో అందరి నోటా ఇప్పుడిదే చర్చ. ప్రముఖుల లిస్ట్ అంతా బయటికి తీస్తున్నారట.