'అసలు ఇలాంటి సినిమా జనానికి ఎక్కుతుందా?' అనే ఆందోళన 'మహానటి' టీమ్‌లోనూ కలిగే వుంటుంది. కానీ, ధైర్యంగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది స్వప్న సినిమా. దర్శకుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా 'మహానటి' సినిమాని తెరకెక్కించాడు. ఆ దర్శకుడికి నటీనటులు, టెక్నీషియన్ల నుంచి సంపూర్ణ సహకారం లభించింది.
అలా 'మహానటి' ఓ మహాద్భుతమైన సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి 'మహానటి' చేరుతుందా? లేదా? అనే అనుమానాలు పటాపంచలైపోయాయి. తాజాగా ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల మార్క్‌ని కూడా దాటేసింది. 'మహానటి' నెక్స్‌ట్ టార్గెట్ 'భరత్ అనే నేను' సినిమానే. ఆ తర్వాత 'రంగస్థలం'. అయితే, అది సాధ్యమేనా? అన్నది ప్రస్తుతానికైతే అనుమానమే. ఒక్కటి మాత్రం నిజం. 'మహానటి' అద్భుతమైన విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాల్లో దీనిని 'బాహుబలి'గా అభివర్ణించొచ్చు.
నటీనటుల ప్రతిభ, సాంకేతిక నిపుణుల సహకారం, అన్నిటికీ మించి నిర్మాతల ప్యాషన్.. ఇవన్నీ 'మహానటి'ని వెరీ వెరీ స్పెషల్ మూవీగా మార్చారు. స్వప్న సినిమా బ్యానర్‌పై స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించగా, 'ఎవడే సుబ్రమణ్యం' ఫేం దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' సినిమాని దృశ్యకావ్యంగా తెరకెక్కించిన సంగతి తెల్సిందే. కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ.. ఇలా ఒకరేమిటి, సినిమా కోసం పనిచేసినవారంతా దీన్నొక యజ్ఞంలా భావించబట్టే 'మహానటి' ఇంత గొప్ప విజయాన్ని అందుకుంది.