'మహానటి' సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఈ సినిమాకి గౌరవ పురస్కారాల హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏదో మూల నుండి అభినందనలు, ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు 'మహానటి'ని ప్రశంసలతో మంచెత్తేశారు. చిత్రయూనిట్ తాజాగా అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని కలిశారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ని ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి, సన్మాన సత్కారాలు అందించారు. నటనలో రామారావుగారి తర్వాత సావిత్రి అంతటి గొప్ప నటి. అలాంటి సావిత్రి జీవితం ఎంతో మంది ఆడపిల్లలకు ఆదర్శం. అలాంటి గొప్ప చరిత్రను అద్భుతమైన చిత్రంగా తీర్చి దిద్దారని డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ని చంద్రబాబు కీర్తించారు. సావిత్రి పాత్ర పోషించిన కీర్తిసురేష్ అద్భుతంగా నటించిందనీ, కీర్తిసురేష్‌నీ పొగడ్తలతో ముంచెత్తేశారు. నిర్మాతలు స్వప్నాదత్, ప్రియాంకా దత్‌లను చంద్రబాబు మెచ్చుకున్నారు.
'మహానటి' ఇది నిజంగానే అరుదైన గౌరవంగా చెప్పాలి. ఈ కార్యక్రమంలో నాగ్ అశ్విన్, కీర్తిసురేష్‌తో పాటు నిర్మాతలు అశ్వనీదత్, స్వప్నాదత్, ప్రియాంకాదత్, సావిత్రి కుమార్తై విజయ చాముండేశ్వరీ తదితరులు పాల్గొన్నారు. మరో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ సినిమాకి పన్ను మినహాయింపు విషయంలో ప్రభుత్వపరంగా ఆలోచన చేస్తామని సీఎం చంద్రబాబు చిత్ర యూనిట్‌కి హామీ ఇచ్చారు. ఒకవేళ పన్ను మినహాయింపు ఇస్తే ఆ మొత్తాన్ని రాజధాని నిర్మాణానికి కేటాయిస్తామని నిర్మాత అన్నారు.
గతంలో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' తదితర చిత్రాలకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.