బాక్సాపీసు దగ్గర మహర్షి దూకుడు ఇంకా ఆగలేదు. 'మహర్షి'ని ఢీ కొట్టి నిలవదడిన సినిమా ఏదీ ఇప్పటి వరకూ రాకపోవడమే అందుకు కారణం. బాక్సాఫీసు దగ్గర మరో సినిమా లేకపోవడంతో, సినీ ప్రేమికులకు మహేష్ బాబు సినిమానే దిక్కయ్యింది. దాంతో మహర్షి వసూళ్ల హవా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రం 175 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్రబృందం ప్రకటించేసింది. మహర్షి కేవలం 19 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. మహేష్ దూకుడు చూస్తుంటే త్వరలోనే 200 కోట్ల మైలు రాయిని అందుకోవడం ఖాయమనిపిస్తోంది.
అయితే మహేష్ డబుల్ సెంచరీ కొట్టేదీ, లేనిదీ ఈ వారం వచ్చే సినిమాలే డిసైడ్ చేస్తాయి. ఈ వారం కూడా బాక్సాఫీసు దగ్గర కొత్త సినిమా తాకిడి ఎక్కువగానే కనిపిస్తోంది. సూర్య నటించిన డబ్బింగ్ బొమ్మ 'ఎన్‌జీకే' ఈ వారం విడుదల అవుతోంది. సూర్య సినిమాలకు బీ, సీ సెంటర్లలో ఆదరణ బాగుంటుంది. ఏమాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా బీ, సీ సెంటర్లలో మహర్షి వసూళ్లు పడిపోవడం ఖాయం.
ఫలక్‌నామా దాస్, అభినేత్రి 2 కూడా ఈవారమే రాబోతున్నాయి. వీటిపై కూడా మంచి అంచనాలున్నాయి. వీటిలో ఏ ఒక్కటి నిలబడినా, ప్రేక్షకులు మరో ప్రత్యామ్నాయం దొరికినట్టే. లేదంటే... మహేష్ డబుల్ సెంచరీ కొట్టడానికి ఇంకెన్నో రోజులు పట్టవు.