డల్‌గా స్టార్ట్ అయిన 'మహర్షి' వసూళ్లు ఊపందుకున్నాయి. వంద కోట్లు ఖాయమనే అంచనాకి వచ్చేశారు. మహేష్ కాలర్ కూడా ఎగరేసేశారు. తొలి రెండు రోజులతో పోల్చితే, వీకెండ్ టూ డేస్‌లో 'మహర్షి' వసూళ్లు బాగా పుంజుకున్నాయి. ఇదే జోరు చూస్తుంటే, 'మహర్షి' ఈ వీకెండ్‌కే రికార్డు దిశగా ఈజీగా పరుగు అందుకుంటుందంటున్నారు. అయితే, రికార్డులు అందుకోవాలంటే, మొదటగా 'ఖైదీ నెంబర్ 150'ని దాటాల్సి వుంటుంది. ఆ తర్వాత 'రంగస్థలం' టచ్ చేయాలి.
'ఖైదీ' ఓకే కానీ, 'రంగస్థలం' టచ్ చేయడం అంత సులువు కాదు. వీకెండ్‌లో వసూళ్లు వర్కవుట్ అయ్యాయి. కానీ మళ్లీ సోమవారం నుండి వసూళ్ల లెక్కల్లో తేడాలు రావచ్చు. ఏది ఏమైనా మహేష్, ఫ్యాన్స్ అంచనాల్ని అందుకోవడంలో సక్సెస్ అయ్యారనే అనిపిస్తోంది. అదే నమ్మకంతో 'మహర్షి' 150 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మహర్షి' మొదటి రోజు నిరాశపరిచినా, టాక్‌తో సంబంధం లేకుండా, వీకెండ్‌కి వచ్చేసరికి సూపర్‌స్టార్ స్టామినాని నిలబెట్టడంలో సక్సెస్ అయ్యింది.
పెద్ద సినిమాలు ఇప్పట్లో పోటీకి లేకపోవడంతో 'మహర్షి'కి ఈ టైం కలిసొచ్చే అంశమే. చూడాలి మరి ఇదే జోరు ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించగా, పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించింది. దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.