సూపర్ హిట్, బ్లాక్ బ్లస్టర్ హిట్, ఎపిక్ బ్లాక్ బ్లస్టర్... ఇలా మహర్షిని పిలుచుకుంటున్నారు అభిమానులు. తన పాతిక సినిమాల కెరీర్‌లో ఈ సినిమానే గొప్ప సినిమా అని మహేష్ బాబు కూడా గర్వంగా చెప్పుకుంటున్నాడు. నిర్మాతలు సక్సెస్ మీట్ల మీద సక్సెస్ మీట్లు పెడుతున్నారు. ఇంత జరిగి ఏం లాభం? ఈ సినిమా సూపర్ డూపర్ ఎపిక్ బ్లాక్ బ్లస్టర్ అయినా - నిర్మాతలక ఒక్క పైసా కూడా మిగల్లేదు. కొన్ని ప్రాంతాలలో బయ్యర్లు కూడా నష్టపోయే ప్రమాదం వచ్చింది. మే 9న విడుదలైన మహర్షికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది.
విమర్శకులు ఈ సినిమాని యావరేజ్‌గా తేల్చేశారు. అయితే తొలి మూడు రోజుల్లో రివ్యూలకు సంబంధం లేని రెవిన్యూ వచ్చింది. వంద కోట్ల మైలు రాయి కూడా ఈజీగానే దాటేసింది. కాకపోతే.. రెండోవారంలో మహర్షి వసూళ్లు క్రమంగా దిగజారుతూ వచ్చాయి. ఓవర్ బడ్జెట్ వల్ల, ఎక్కువ రేట్లకు సినిమాని అమ్మడం వల్ల... బయ్యర్లకు బ్రేక్ ఈవెన్ రావడమే గగనం అయిపోతోంది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్‌కి చేరలేదు.
ఓవర్సీస్‌లో అయితే ఏకంగా కోటి రూపాయల నష్టం తేలింది. కొన్ని ఏరియాల్లో ఇంకా 20 నుంచి 30 శాతం వరకూ రికవరీ అవ్వాల్సివుంది. ఇలా ఏ రూపంలో చూసినా ఈ సినిమా తీసిన ముగ్గురు నిర్మాతలకు చేతిలో డబ్బులు పడడం ఖాయంగా అనిపిస్తోంది. బడ్జెట్ కాస్త కంట్రోల్‌లో పెట్టుకుని ఈ సినిమాని వంద కోట్లలో పూర్తి చేస్తే... ఈ హిట్‌కి తగిన ఫలితం దక్కేదేమో.