సినిమాని అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేసి ఇవ్వడమే మొదటి విజయం. ఆ విషయంలో చాలా సినిమాలు బోల్తా పడుతుంటాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు బడ్జెట్ లిమిట్‌ని దాటేసి - నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంటాయి. బడ్జెట్ మితిమీరి పోవడం వల్లే... సినిమా విజయవంతమైనా, లాభాలు నిర్మాతల చేతుల వరకూ రాకుండా పోతున్నాయి. ఇప్పుడు `మహర్షి`కీ ఓవర్ బడ్జెట్ సమస్య ఎదురవుతున్నట్టు సమాచారం.
మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీదత్, దిల్‌రాజు, పీవీవీ నిర్మాతలు. కథ రీత్యా అమెరికాలో కీలకషెడ్యూల్ తెరకెక్కించాల్సివచ్చింది. మరోవైపు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రూ.10 కోట్లతో ఓ పల్లెటూరి సెట్ వేశారు. ఈ రెండింటివల్ల.. బడ్జెట్ చేయిదాటి పోయిందని సమాచారం. వంశీ పైడిపల్లి కాస్త స్లో. మిస్టర్ పర్‌ఫెక్ట్ రూపంలో తీసిన సీన్‌నే మళ్లీ తీసుకుంటూ వెళ్తాడు. మహేష్ కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడడు.
అందుకే.... షూటింగ్ డేస్ కూడా పెరుగుతూ వెళ్తున్నాయట. ఇలాగైతే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తచేయడం కష్టం, బడ్జెట్ కూడా మించిపోతుందని.. నిర్మాతలు టెన్షన్ పడుతున్నార్ట. కాగితంపై రాసుకున్న బడ్జెట్‌కీ, చివర్లో తేలే లెక్కలకు 2 నుంచి 5 శాతం వరకూ తేడా ఉన్నా ఫర్వాలేదు. దాదాపు 10 నుంచి 20 శాతం బడ్జెట్ పెరిగే అవకాశాలున్నయన్నది ఇన్‌సైడ్ వర్గాల టాక్. మరి... చివరికి లెక్క ఎంతకు తేలుతుందో చూడాలి.