సినిమా టికెట్ల ధరలు పెంచడం అనేది చాలా సినిమాల విషయంలో కామన్‌గా జరుగుతున్న పరిణామమే. గతంలో 'బాహుబలి' సినిమాకీ ఇలాగే టిక్కెట్ ధరల్ని పెంచడం జరిగింది. అలాగే 'మహర్షి' విషయంలోనూ జరిగినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. రేపు విడుదల కాబోతున్న మహర్షి సినిమాకి టికెట్ల ధరలు పెంచారంటూ వార్తలొచ్చాయి. ఈ అంశమై బయట తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. మరో వైపు తెలంగాణా ప్రభుత్వం కూడా టికెట్ ధర పెంపకానికి మేము అనుమతివ్వలేదనీ చెబుతోంది.
ఎక్స్‌ట్రా షోలకు అనుమతిచ్చాం కానీ, టికెట్ ధర పెంపుకు మేం అనుమతించలేదు అని స్వయానా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే, ధర పెంచినట్లు ఆల్రెడీ టికెట్స్ కొనుగోలు చేసిన వారు చెబుతున్నారు. ధర పెంచామంటూ డిస్ట్రిబ్యూటర్లు ద్వారా కూడా వార్త బయటికొచ్చింది. ఇదిలా ఉంటే, ఈ గందరగోళం నడుమ కొన్ని చోట్ల ఆడ్డగోలుగా రేట్లు పెంచేశారు. అభిమానులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. ఇంత రచ్చ జరుగుతోంటే, ఇటు సినిమా డిస్ట్రిబ్యూటర్ వైపు నుండి కానీ, 'మహర్షి' ప్రొడ్యూసర్స్ వైపు నుండి కానీ, స్పష్టమైన వివరణ కనిపించడం లేదు.
'మహర్షి' సినిమాపై ఇప్పటికే బోలెడంత నెగిటివిటీ, ప్రచారంలో ఉంది. అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో, అంతకు మించిన రేంజ్‌లో నెగిటివిటీ కూడా ప్రచారంలో ఉంది. ఈ తరుణంలో టికెట్ ధరల పెంపు గందరగోళం అగ్నికి ఆధ్యం పోసినట్లైంది. ఈ విషయంపై 'మహర్షి' టీమ్ స్పందించాల్సిన అవసరం ఉంది.