మరి కొద్ది గంటల్లో `మహర్షి` థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే... అడ్వాన్సు బుకింగుల హడావుడి మొదలైపోయింది. మల్టీప్లెక్స్‌లలో రేట్లు పెరిగినా - ఫ్యాన్స్ ఎక్కడా తగ్గడం లేదు. సినిమా టాక్ ఎలా ఉన్నా - తొలి వారాంతంలో ఈసినిమా వంద కోట్ల మైలు రాయిని దాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా హిట్టయితే మాత్రం రామ్ చరణ్ రికార్డు బద్దలవ్వడం ఖాయం.
నాన్ బాహుబలి రికార్డు చరణ్ `రంగస్థలం` పైనే ఉంది. చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర ప్రభంజనం సృష్టించింది. బాహుబలి తరవాత.. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి దాదాపు రూ.130 కోట్ల షేర్ వచ్చింది. అంతకు ముందు ఈ రికార్డు మహేష్‌కే సొంతం. భరత్ అనే నేను పేరుమీద ఉన్న రికార్డుని రంగస్థలం దాటుకుని వెళ్లింది. ఇప్పుడు మళ్లీ ఈ రికార్డుని తిరగరాయడానికి మహేష్ రెడీ అవుతున్నాడు.
సినిమాకి ఏ మాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా.. రంగస్థలం రికార్డు బద్దలవ్వడం గ్యారెంటీ. ఎందుకంటే.. మహర్షి టికెట్ రేట్లు పెరిగాయి. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్‌లలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఈ పెరిగిన టికెట్ ధరలే... రంగస్థలం రికార్డుకి ఎసరపెట్టేస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.