మహర్షి ఫీవర్ మొదలైపోయింది. రుషిగా మహేష్‌ని ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా... అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. 2 గంటల 55 నిమిషాల నిడివి గల ఈ చిత్రానికి ఒక్క కట్ కూడా లేకుండా ఈ చిత్రానికి యూ బై ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని హైలెట్స్ బయటకు వచ్చాయి. మూడు గెటప్పులలో మహేష్‌బాబు విశ్వరూపం చూపించబోతున్నాడట. కాలేజీ విద్యార్థిగా, వ్యాపారవేత్తగా, రైతు పక్షపాతిగా... రుషి పాత్రలో మూడు విభిన్న ఛాయలుంటాయి. తండ్రీ -కొడుకుల సెంటిమెంట్ ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా మారబోతోందని టాక్. ప్రకాష్‌రాజ్ - మహేష్ ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా నటించారు. నరేష్‌తో ఫ్రెండ్ షిప్ సీన్స్ ఈ సినిమాని, కథనీ మరోస్థాయిలో నిలబెట్టబోతున్నాయట. నరేష్ పాత్రని మలిచిన తీరు షాకింగ్‌గా ఉంటుందని సమాచారం. భరత్ అనే నేనులో ప్రెస్ మీట్ సీన్ ఒకటుంది.
మీడియాపై అందులో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. అలాంటి సన్నివేశమే మహర్షిలోనూ ఉందట. ఈసారి మహేష్ రైతుల కోసం ప్రసంగిస్తాడట. ఆ సీన్ తప్పకుండా చప్పట్లు కొట్టించేలా ఉంటుందని చెబుతున్నారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్.. ఇవి రెండూ బాగా వచ్చాయని, ఓ ఎమోషనల్ డ్రైవ్‌లా ఈ సినిమా సాగిపోవడానికి ఈ సన్నివేశాలు దోహదం చేస్తాయని సమాచారం. దేవిశ్రీ ఇచ్చిన నేపథ్య సంగీతం, కె.యు మోహనన్ కెమెరా వర్క్ గురించి అందరూ మాట్లాడుకుంటారని, ఆ స్థాయిలో సాంకేతిక నైపుణ్యం కనిపించబోతోందని చెబుతున్నారు. మొత్తానికి మహర్షి మహేష్ కెరీర్‌లో ఓ మైలు రాయిగా మిగిలిపోయే ఆస్కారం ఎక్కువ కనిపిస్తోందని సమాచారం. మరి.. ఇవన్నీ నిజమై మహేష్ సినిమా గత రికార్డులన్నీ బద్దలు కొడితే అంతకంటే కావల్సిందేముంది?